లీకుల మీద లీకులు.. దిల్ రాజు ఏం చేస్తున్నాడు?

May 27, 2020

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ ‘పింక్’ షూటింగ్ శరవేగంగా జరిగిపోతోంది. రెండు వారాల కిందటే చిత్రీకరణ మొదలు కాగా.. ఇప్పటికే కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించినట్లు తెలుస్తోంది. సినిమాలో ఉండే ఏకైక యాక్షన్ ఎపిసోడ్‌తో ఈ సిినిమా చిత్రీకరణ మొదలైంది. ఐతే ఇలా షూటింగ్ మొదలైందో లేదో అలా లీకులు వచ్చేస్తుండటం చిత్ర బృందాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. పవన్ సినిమా అంటే జనాల్లో ఉండే క్యూరియాసిటీకి తగ్గట్లే ఆన్ లొకేషన్ ఫొటోలు, వీడియోలు బయటికి వస్తున్నాయి. ఇంతకుముందులా ఫొటోలే వస్తుంటే పర్వాలేదు. కానీ ఇప్పుడు వీడియోలు కూడా వచ్చేస్తున్నాయి. తాజాగా సినిమాలో ఓ పవర్ ఫుల్ సీన్లో పవన్ పవర్ ఫుల్ డైలాగ్ చెప్పే సన్నివేశాన్ని ఎవరో బయటపెట్టేశారు. ‘‘నేను కానీ నల్లకోటు వేశానంటే.. పిటిషన్లుండవు, బెయిళ్లుండవు’’ అంటూ పవన్ రౌడీని కొడుతూ చెప్పే డైలాగ్ తాలూకు వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

 ఇలాంటి లీక్డ్ ఫొటోలు, వీడియోలు పెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఇవి ఆగట్లేదు. తాజా వీడియోను పరిశీలిస్తే చిత్ర యూనిట్లోని వ్యక్తే చాలా కెమెరాలకు చాలా దగ్గరగా ఉంటూ దీన్ని షూట్ చేశాడు. పవన్ లాంటి హీరోతో ప్రతిష్టాత్మకమైన సినిమా తీస్తూ దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాత ఈ లీకుల్ని నివారించలేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తూ.. ఫొటోలు, వీడియోలు తీయకుండా ఆ మాత్రం సెక్యూరిటీ ఏర్పాట్లు చేయలేకపోతున్నారేంటనే ప్రశ్న తలెత్తుతోంది. అసలు షూటింగ్ స్పాట్‌కు దగ్గర్లో బయటి వ్యక్తులు లేకుండా చూసుకోవడం.. సెట్లో మొబైల్స్‌ లేకుండా చూడటంలో దిల్ రాజు సంస్థ ఎందుకు విఫలమవుతోందో అర్థం కావడం లేదు. సత్వర దిద్దుబాటు చర్యలు తీసుకోకుంటే సినిమా విషయంలో క్యూరియాసిటీ తగ్గిపోయి.. మున్ముందు మరింత డ్యామేజ్ జరగడం ఖాయం.