బీజేపీలో గందరగోళం... ఈ ప్రశ్నకు సమాధానం లేదు!!

February 25, 2020

ఆంధ్రప్రదేశ్ ప్రజలు సమాధానం చెప్పలేని ప్రశ్న ఇపుడు ఏదైనా ఉందా అని అంటే... ఎస్ ఉంది అని చెప్పొచ్చు. ’బీజేపీ రాజధాని మార్పుకు అనుకూలమా? వ్యతిరేకమా?’’ అన్న ప్రశ్నకు ఏ ఆంధ్రుడు సమాధానం చెప్పలేడు. అవును.. గత నెల రోజుల్లో బీజేపీ నేతలు అంత అయోమయం సృష్టించారు. అంత గందరగోళంలో పడ్డారు. జనాల్ని పిచ్చోళ్లను చేశారు. పార్టీ పైనుంచి కింది క్యాడర్ దాకా ఒక్కొక్కరిది ఒక్కో బాట, ఒక్కో మాట.  

పార్టీ ఏపీ అధ్యక్షుడు కన్నా రాజధాని అమరావతియే ఉండాలంటాడు. జీవీఎల్ వైజాగ్ రాజధాని అయితే తప్పేంటి అంటాడు. సుజనను అడిగితే కేంద్రంతో మాట్లాడాను. రాజధాని అంగుళం కూడా కదలడానికి వీల్లేదు అంటాడు. విష్ణు ఏమో మూడు రాజధానులు బెటర్ అంటాడు. ఈ కన్ఫ్యూజన్ చాలక... కేంద్ర మంత్రి కూడా ఎంటరయ్యాడు. రాజధాని అనేది రాష్ట్రం చేతిలోని పాయింట్ కాబట్టి మేము పట్టించుకోం అంటాడు. మళ్లీ ఆయనే... రాజధాని గురించి నివేదిక కేంద్రానికి సమర్పిస్తే అపుడు ఏం చేయాలో చూద్దాం అంటాడు. ఒక్క పార్టీలోనే మనిషికి మనిషికి ఇంత తేడా అభిప్రాయం ఉంటే... ఎవరు మాత్రం ఆ పార్టీ స్టాండ్ ను చెప్పగలరు. ?

కేంద్ర ప్రభుత్వం తీరు ఇందులో అంత సమంజసంగా లేదు. రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతినకుండా రాష్ట్రాల హక్కులు కాపాడాలి. ఉదాహరణకు ఇపుడు కనుక రాజధాని అడ్డుకోకపోతే... ఈ ఐడియాను దేశంలో అని రాష్ట్రాలు దుర్వినియోగం చేస్తే ఏంటి పరిస్తితి? ఒక్కో పార్టీ గెలిచినపుడు ఒక్కో ప్రాంతానికి ప్రాధాన్యం ఇస్తూ రాజధానులు మారుస్తూ పోతే దాని భారం సామాన్యులపైనే కదా అంతిమంగా పడేది. ఈ దుష్ట సంప్రదాయానికి చెక్ చెప్పకపోతే... ఇది అనేక ఇతర రాష్ట్రాల్లో అవాంఛనీయ మార్పులకు కారణం కాదని గ్యారంటీ ఏంటి? 

అయితే... ఎవరెన్ని మాట్లాడినా దీనిపై మోడీ షాలు ఇంకా నోరు విప్పలేదు. బహుశా బడ్జెట్ అయిపోయేదాకా వారు నోరు విప్పకపోవచ్చు. వారు స్పందించాల్సిన అంశాలు ిి ఇపుడు చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ విషయంలో వేచిచూసే ధోరణిలో ఉండొచ్చు.