మహేష్‌ను గట్టిగా పట్టేసుకున్న డైరెక్టర్

August 07, 2020

వంశీ పైడిపల్లితో మహేష్ బాబు తన 25వ సినిమాను ప్రకటించినపుడు అతడి అభిమానులు అంత పాజిటివ్‌గా తీసుకోలేదు. ఇలాంటి మైల్ స్టోన్ మూవీకి ట్రాక్ రికార్డు ఏమంత బాగా లేని వంశీ దర్శకుడా అని పెదవి విరిచారు. ఇక ఈ సినిమా రిలీజ్ ముంగిట.. రిలీజ్ తర్వాత ఎంత నెగెటివిటీ నడిచిందో గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాకు కాాలం కలిసొచ్చి బాగానే ఆడింది కానీ.. చాలా యావరేజ్‌గా, రొటీన్‌గా అనిపించిన ఈ సినిమా విషయంలో మహేష్ ఫ్యాన్స్ ఏమంత సంతృప్తిగా అయితే కనిపించలేదు. ‘మహర్షి’ రిలీజయ్యాక ఇదొక ఎపిక్ మూవీ అని ప్రచారం చేసుకుంటుంటే మహేష్ అభిమానులకే ఏదోలా అనిపించింది. ఈ సినిమా రిలీజ్ తర్వాత కూడా మహేష్‌తో వంశీ చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తుంటే.. మావాణ్ని వదలవా అంటూ మహేష్ ఫ్యాన్స్ ట్వీట్లు వేయడం.. ట్రోల్ చేయడం గమనార్హం. ఇది కొంచెం పెద్ద స్థాయిలోనే జరిగింది.
మహేష్‌తో వంశీ మరో సినిమా చేయబోతున్నాడని ప్రచారం జరిగినపుడు కూడా నెగెటివ్ కామెంట్లే వచ్చాయి. కానీ వంశీ తగ్గలేదు. మహేష్ సైతం వెనుకంజ వేయలేదు. ఇద్దరూ కలిసి మరో సినిమా చేయడానికే నిర్ణయించుకున్నారు. ఇండస్ట్రీ వర్గాల తాజా సమాచారం ప్రకారం వంశీ 27వ సినిమా వంశీతోనే ఉంటుందట. ప్రస్తుతం అనిల్ రావిపూడితో చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’ సంక్రాంతికి రిలీజయ్యాక.. మహేష్ కొంచెం గ్యాప్ తీసుకుని వంశీ సినిమా మీదికి వెళ్లిపోతాడని సమాచారం. ప్రస్తుతం వంశీ స్క్రిప్టు వండే పనిలో ఉన్నాడు. వంశీతో ఇప్పటికే నాలుగు సినిమాలు తీసిన వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ మీద దిల్ రాజే ఈ చిత్రాన్ని నిర్మిస్తాడట. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించే అవకాశాలున్నట్లు సమాచారం. ‘సరిలేరు నీకెవ్వరు’ రిలీజ్ ముంగిటే ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తోంది.