మోడీ ఫేవరెట్ బిల్లుకు చిక్కులు

June 01, 2020

కొన్ని పార్టీలు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న ట్రిపుల్ త‌లాక్ బిల్లు లోక్ స‌భ‌లో ఆమోదం పొంద‌టం.. ఈ రోజు (మంగ‌ళ‌వారం) ఈ బిల్లు రాజ్య‌స‌భ‌లో ప్ర‌వేశ పెట్టారు. దీనికి సంబంధించిన బిల్లు ప్ర‌తిని కేంద్ర‌మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్‌ ప్ర‌వేశ పెట్టారు. బిల్లుపై చ‌ర్చ ఆరంభించిన మొద‌ట్లోనే విప‌క్ష నేత‌లు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు.
ఇదిలా ఉంటే చ‌ర్చ‌ను ప్రారంభించిన కేంద్ర‌మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ మాట్లాడుతూ.. చిన్న చిన్న ఇస్లామిక్ దేశాలు సైతం ట్రిపుల్ త‌లాక్ ను నిషేధించాయ‌ని గుర్తు చేశారు. చిన్న చిన్న కార‌ణాల‌తో విడాకులు ఇస్తున్న వైనం సుప్రీంకోర్టు దృష్టికి వ‌చ్చింద‌ని.. అందుకు సంబంధించిన ప‌త్రాల‌తో పాటు.. మీడియా క్లిప్పింగులు కూడా తాను జ‌త చేస్తున్న‌ట్లు చెప్పారు.
ఈ బిల్లు మాన‌వ‌త్వానికి.. న్యాయానికి సంబంధించింద‌ని.. మ‌తంతో సంబంధం లేద‌న్నారు. మ‌హిళ‌ల అభ్యున్న‌తి కోస‌మే తామీ బిల్లును తీసుకొచ్చామ‌న్నారు. లోక్ స‌భ‌లో బీజేపీకి ఉన్న బ‌లంతో ఈజీగా ఈ బిల్లు పాస్ అయినా.. పెద్ద‌ల స‌భ‌లో మాత్రం కాస్త క‌ష్ట‌మేన‌ని చెబుతున్నారు. అంతంత‌మాత్రంగా ఉన్న బ‌లంతో పాటు.. ఈ బిల్లుపై బీజేపీ మిత్ర‌ప‌క్షాలు సైతం గుర్రుగా ఉండ‌ట‌మే కాదు.
దీనికి త‌గ్గ‌ట్లే ఈ బిల్లుపై విప‌క్ష ఎంపీలు తీవ్ర‌స్థాయిలో దునుమాడుతున్నారు. రెండు స‌భ‌ల్లో ప్ర‌వేశ పెట్ట‌టానికి ముందే ఈ బిల్లును సెలెక్ట్ క‌మిటీ ముందుకు పెట్టాల‌ని చెప్పినా.. అలాంటిదేమీ చోటు చేసుకోలేదు. ఈ రోజు ఎట్టి ప‌రిస్థితుల్లో ఈ బిల్లును రాజ్య‌స‌భ‌లో ఆమోద ముద్ర వేయాల‌న్న ప‌ట్టుద‌ల‌తో బీజేపీ ఉంది. దీనికి త‌గ్గ‌ట్లే కేంద్ర‌మంత్రి అమిత్ షా స‌భ‌లో స్వ‌యంగా స‌మీక్షిస్తూ.. బిల్లుకు ఆమోద‌ముద్ర‌ప‌డేలా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ బిల్లు నేప‌థ్యంలో బీజేపీ త‌న పార్టీ ఎంపీల‌కు ఇప్ప‌టికే విప్ జారీ చేసింది.
దేశంలో మ‌హిళ‌లంద‌రూ ఇలాంటి స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నార‌ని.. ట్రిపుల్ త‌లాక్ పేరుతో ఒక మ‌తాన్ని టార్గెట్ చేసేలా ఎందుకు బిల్లు తెస్తున్నారంటూ కాంగ్రెస్ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. ఈ బిల్లుపై హాట్ హాట్ గా చ‌ర్చ న‌డుస్తోంది. ఏది ఏమైనా.. ఈ బిల్లుపై నాలుగైదు ఓట్ల తేడాతో అయినా పాస్ చేయించాల‌న్న ప‌ట్టుద‌ల‌తో బీజేపీ ఉంది. మ‌రేం జ‌రుగుతుందో చూడాలి.