‘దిశ’ నిందితుల డెడ్ బాడీస్ ఏం చేస్తున్నారో తెలుసా?

March 28, 2020
CTYPE html>
హైదరాబాద్ శివార్లలో వెటర్నరీ వైద్యురాలిపై అత్యాచారం చేసి కాల్చి చంపేసిన నలుగురు నిందితుల్ని పోలీసులు ఎన్‌కౌంటర్ చేసి పది రోజులు దాటింది. కానీ ఇప్పటిదాకా వారి మృతదేహాల్ని తమకు అప్పగించకపోవడం, అంత్యక్రియలు కూడా జరపనివ్వకపోవడం ఆయా కుటుంబాల వాళ్లను తీవ్ర మనోవేదనకు గురి చేస్తోంది. ఆ నలుగురు చేసిన తప్పుకు ఇప్పుడు వారి కుటుంబాలు కూడా శిక్ష అనుభవిస్తున్నాయి. ముందు మృతదేహాల్ని మూడు రోజులు మాత్రమే భ్రదపరిచి.. ఆ తర్వాత వారి కుటుంబాలకు అప్పగిస్తారన్నారు. కానీ ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఎన్‌కౌంటర్ మీద కోర్టుల్లో కేసులు వేయడం, సుప్రీం కోర్టు వరకు ఈ కేసు వెళ్లడంతో ఎన్‌కౌంటర్ జరిగిన పది రోజుల తర్వాత కూడా మృతదేహాలు హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికే పరిమితం అయ్యాయి. అక్కడ డెడ్ బాడీస్‌ పాడవకుండా ఏమాత్రం సంరక్షిస్తున్నారో తెలియదు. అవి ఏ స్థిితికి చేరాయో తెలియదు.
ఈ నలుగురు నిందితులు చేసింది దారుణాతి దారుణమైన పనే అయినా.. వారి ఎన్‌కౌంటర్‌ పట్ల ప్రజలందరూ హర్షం వ్యక్తం చేసినా.. వాళ్లు చేసిన తప్పుకు కుటుంబ సభ్యులు అనుభవిస్తున్న వేదన మాత్రం దారుణమైనది. చనిపోయిన పది రోజుల తర్వాత కూడా మృతదేహాలు తమ ఇళ్లకు రాకపోవడం, అంత్యక్రియలు జరపకపోవడంతో నరకయాతన అనుభవిస్తున్నారు. అది చాలదన్నట్లు రోజూ కొందరు మీడియా వాళ్లు వెళ్లి వాళ్లను ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఏం మాట్లాడాలో తెలియని శోకంలో వాళ్లేదేదో మాట్లాడుతున్నారు. అవి టీవీల్లో, యూట్యూబ్ ఛానెళ్లలో మంచి టీఆర్పీ, వ్యూస్ తెచ్చిపెడుతున్నాయి. కానీ కడు పేద కుటుంబాలకు చెందిన బాధితులకు ఎవ్వరూ ఏ రకమైన సాయమూ అందించట్లేదు. నిందితులు చేసిన ఘోరం వల్ల వారి కుటుంబాల పట్ల ఎవరికీ జాలి అన్నది లేకపోయింది. జరిగిందేదో జరిగిందనుకుంటే.. కనీసం వాళ్ల మృతదేహాలు కూడా ఇప్పటిదాకా తమ వద్దకు చేరకపోవడం, అంత్యక్రియలు జరపలేకపోవడం ఆ పేద కుటుంబాల వాళ్లను క్షోభకు గురిచేస్తోంది. తమ దగ్గరికి వచ్చిన మీడియా వాళ్లందరినీ ఈ విషయంలో సాయం చేయాలని వాళ్లు వేడుకుంటున్నారు.