కాంగ్రెస్ కు మరో చావు దెబ్బ వేసిన మోడీ

July 11, 2020

మోడీ వేట కొనసాగుతోంది. కాంగ్రెస్ కు పిల్లర్ వంటి వారిని మట్టుబెడుతోంది. తాజాగా కర్ణాటకలో వ్యూహకర్తగా పేరొందిన డి.కె. శివకుమార్ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. మనీలాండరింగ్ కేసులో డీకే శివకుమార్ ను అరెస్టు చేస్తున్నట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)  పేర్కొంది. ఆయనను 4 రోజులుగా ఈడీ అధికారులు విచారిస్తున్న విషయం తెలిసిందే. నేడు విచారణ అనంతరం అరెస్ట్ చేశారు. 2018 సెప్టెంబరులో శివకుమార్ తో పాటు మరికొందరిపై ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. హవాలా ద్వారా డబ్బును విదేశాలకు తరలించారన్నది ఆరోపణ. దీనిపై నమోదు అయిన కేసులో ఆయనను అరెస్టు చేశారు. పెద్దమొత్తంలో నగదును తరలించారన్న ఫిర్యాదును ఈడీ శోధిస్తోంది.

ఆదాయపు పన్ను విభాగం శివకుమార్ పై దాఖలు చేసిన చార్జిషీట్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి ఆయనను విచారిస్తున్నారు. మరోవైపు బెయిలు కోసం శివకుమార్ కోర్టును ఆశ్రయించారు. ఫలితం దక్కలేదు. ఆయన పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. ఇప్పటికే మోడీపై కాక మీదున్న కాంగ్రెస్ శివకుమార్  అరెస్ట్ నేపథ్యంలో ఘాటుగా స్పందించింది. బీజేపీ పాలన చేతకాక రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడి, ప్రత్యర్థి పార్టీలు లేకుండా చేయాలనే కుట్రతో ముందుకు వెళ్తోందని అన్నారు. 

అరెస్టుపై శివకుమార్ ట్విట్టరు స్పందిస్తూ... ఎవరూ బాధపడకండి, ఆందోళన చెందకండి. బీజేపీ కక్ష పూరిత రాజకీయాలతో అరెస్టు చేయగలదు. కానీ నేను తప్పు చేయనందున ఎన్నటికీ నిరూపించలేదు. దేవుడి మీద, భారతీయ న్యాయవ్యవస్థ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. కచ్చితంగా నిర్దోషిగా బయటకు వస్తాను అని పార్టీ శ్రేణులకు ఆయన సందేశం ఇచ్చారు. ఇదే సందర్భంలో ఆయన మరో ట్వీటు వేశారు. నన్ను అరెస్టు చేయాలన్న మిషన్ మీద పనిచేసి విజయం సాధించిన బీజేపీకి శుభాకాంక్షలు అని ఆయన బీజేపీకి విషెస్ చెప్పారు.