ఢిల్లీలో ఆప్ గెలుపు....త‌మిళ‌నాడులో డీఎంకే సంబ‌రాలు!

July 15, 2020

దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ మ‌రోసారి విజ‌య ఢంకా మోగించింది. తాను చేసిన సంక్షేమ ప‌థ‌కాలే అస్త్రంగా బ‌రిలోకి దిగిన  క్రేజీ సీఎం కేజ్రీవాల్ మ‌రోసారి త‌న స‌త్తా చాటారు. వ‌రుస‌గా మూడో సారి ఢిల్లీ సీఎం పీఠాన్ని కైవ‌సం చేసుకొని హ్యాట్రిక్ కొట్టారు. ఢిల్లీలోని గ‌ల్లీలో సైతం వ‌ద‌ల‌కుండా బీజేపీ హేమా హేమీల ప్ర‌చారాన్ని దీటుగా ఎదుర్కొన్న కేజ్రీవాల్ 13508 ఓట్ల మెజారిటీతో విజ‌య ఢంకా మోగించారు. పోలింగ్ ఏజెంట్లుగా బ‌డా నేత‌లు కూర్చున్న‌ప్పటికీ....బీజేపీ విజ‌యానికి కేజ్రీ `వాల్‌` అడ్డుగా నిలిచారు. తాజాగా హ్యాట్రిక్ కొట్టిన కేజ్రీవాల్‌కు దేశ‌వ్యాప్తంగా ప‌లువురు నేత‌లు అభినంద‌నలు తెలుపుతున్నారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్..... కేజ్రీవాల్‌ను కలిసి అభినందనలు తెలిపారు.
2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే ప‌నిచేశారు. ఢిల్లీకి మూడోసారి కాబోయే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు పీకే అభినంద‌న‌లు తెలిపారు. సీఏఏకు వ్య‌తిరేకంగా గ‌ళం విప్పి జేడీయూ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసిన పీకే.....ఫ‌లితాల  సంద‌ర్భంగా బీజేపీపై ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు గుప్పించారు.
‘భారత ఆత్మను ఢిల్లీ ఓటర్లు గెలిపించారు’ అని బీజేపీని ఉద్దేశించి పీకే పరోక్షంగా ట్వీట్ చేశారు.  ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలోనూ బీజేపీపై పీకే ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తోన్న బీజేపీ...దేశంలో క‌ల్లోలం సృష్టిస్తోందంటూ మండిప‌డ్డారు.
2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీ త‌ర‌ఫున ప‌ని చేసిన పీకే....2015లో బిహార్‌లో నితీశ్ కుమార్ త‌ర‌ఫున‌, 2017లో పంజాబ్‌, యూపీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ర‌ఫున‌, 2019 ఏపీ ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున ప‌నిచేశారు. యూపీ ఎన్నిక‌లు మిన‌హా మిగ‌తా అన్ని ఎన్నిక‌ల్లో పీకే స్ట్రాట‌జీస్ వ‌ర్క‌వుట్ అయ్యాయి. సీఏఏపై భేదాభిప్రాయాల నేప‌థ్యంలో జేడీయూ ఉపాధ్యక్ష పదవి నుంచి పీకేను ఆ పార్టీ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ జ‌న‌వ‌రి నెల‌లో తొలగించారు. 2021 త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో డీఎంకే త‌ర‌ఫున రాజ‌కీయ వ్యూహ‌క‌ర్తగా పీకే ప‌నిచేయనున్నారు. తాజాగా ఢిల్లీలో ఆప్ గెలుపుతో డీఎంకే అధినేత స్టాలిన్ రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌న గెలుపుపై మ‌రింత ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. కేజ్రీవాల్ గెలుపుతో స్టాలిన్‌లో న‌యా జోష్ వ‌చ్చింద‌ట‌.ఢిల్లీలో ఆప్ గెలుపుతో....త‌మిళ‌నాడులో డీఎంకే సంబ‌రాలు చేసుకుంటోంద‌ట‌. మ‌రి, త‌మిళ తంబీల న‌మ్మ‌కాన్ని పీకే ఎంత‌వ‌రకు నిల‌బెడ‌తార‌న్న‌ది తేలాలంటే మ‌రి కొంతకాలం వేచి చూడ‌క త‌ప్ప‌దు.