ప‌క్కింటి కుక్క‌తో అక్ర‌మ సంబంధం - తరిమేసిన యజమాని

August 07, 2020

ఎవ‌డి న‌మ్మ‌కాలు ఏంటో? ఎవ‌డి పిచ్చ ఏమిటో ఒక ప‌ట్టాన అర్థం కాదు. కొంద‌రు కొన్ని విష‌యాల్లో వ్య‌వ‌హ‌రించే తీరు విచిత్రంగా ఉండ‌ట‌మే కాదు.. ఎలా రియాక్ట్ కావాలో ఒక ప‌ట్టాన అర్థం కాన‌ట్లు ఉంటుంది. తాజాగా అలాంటి ఉదంత‌మే ఒక‌టి కేర‌ళ‌లో చోటు చేసుకుంది. తాజాగా వైర‌ల్ అవుతున్న ఈ ఉదంతం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.
కేర‌ళ‌లోని ఒక ర‌ద్దీ మార్కెట్ బ‌య‌ట మూడేళ్ల వ‌య‌సున్న తెల్ల‌ని పొమ‌రేనియ‌న్ జాతి కుక్క ఒక‌టి బిక్కుబిక్కుమంటూ ఉండ‌టాన్ని గ‌మ‌నించాడో జంతుప్రేమికుడు. ఆ వెంట‌నే.. దాన్ని అక్కున చేర్చుకొని.. దాని య‌జ‌మాని ఎవ‌ర‌న్న‌ది వెతికే ప్ర‌య‌త్నం చేశాడు.
ఆ స‌మ‌యంలో ఆ కుక్క మెడ‌లోఉంచిన ఒక ఉత్త‌రం ఆ జంతుప్రేమికుడు షామిన్ కంట ప‌డింది. మ‌ల‌యాళంలో ఉన్న ఆ ఉత్త‌రాన్ని చ‌ద‌విన అత‌గాడు అవాక్కు అయ్యాడు. ఇలాంటోళ్లు కూడా ఉంటారా? అని ఆశ్చ‌ర్య‌పోయాడు. ఇంత‌కీ.. ఆ ఉత్త‌రంలో ఉన్న మేట‌ర్ ఏమిటో తెలుసా? చాలా మంచి జాతికి చెందిన కుక్క అని.. అంద‌రితోనూ చ‌క్క‌గా ప్ర‌వ‌ర్తిస్తుంద‌ని.. ఎక్కువ తిండి అవ‌స‌రం లేద‌ని.. ఎలాంటి జ‌బ్బులు లేవ‌ని పేర్కొన్నారు.
ఐదు రోజుల‌కోసారి స్నానం చేయిస్తే స‌రిపోతుంద‌ని.. మూడుళ్ల‌లో ఒక్కసారి కూడా ఎవ‌రిని క‌ర‌వ‌లేద‌ని.. పాలు.. బిస్కెట్.. గుడ్డు ఆహారంగా ఇస్తే స‌రిపోతుంద‌ని అందులో ఉంది. ఇన్ని వివ‌రాలు ఉన్నాయి.. ఇంత‌కీ అంత మంచి కుక్క‌ను ఎందుకు వ‌దిలేసిన‌ట్లు? అన్న డౌట్ వ‌చ్చిందా? అక్క‌డికే వ‌స్తున్నాం. దీనికి సంబంధించి ఆ ఉత్త‌రంలో ఉన్న కార‌ణం.. వారి మాట‌ల్లోనే చూస్తే..
"ఇప్పుడు దీన్ని ఇలా వ‌దిలేయ‌టానికి ఒక కార‌ణం ఉంది. ఇది ప‌క్కింటి కుక్క‌తో అక్ర‌మ సంబంధం పెట్టుకుంది. అందుకే దీన్ని వ‌దిలేశాను" అని పేర్కొన్నారు. కుక్క‌ల్ని వ‌దిలేయ‌టానికి పెద్ద జ‌బ్బు ఉండ‌ట‌మో.. మ‌రింకేదైనా కార‌ణాలు ఉంటాయి కానీ.. ఇలాంటి కార‌ణంతో వ‌దిలేయ‌ట‌మా? అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన స‌ద‌రు జంతు ప్రేమికుడు ఆ కుక్క‌ను తానే పెంచుకుంటాన‌ని పేర్కొన్నాడు. ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.