రాజ్ ఘాట్‌లో త‌న గుర్తుగా ట్రంప్ చేసిందిదే!

August 12, 2020

భార‌త్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స‌తీస‌మేత ప‌ర్య‌ట‌న తొలి రోజు దిగ్విజ‌యంగా కొన‌సాగిన సంగ‌తి తెలిసిందే. అగ్ర‌రాజ్య అధ్య‌క్షుడు, పెద్ద‌న్న అయిన ట్రంప్‌న‌కు తొలిరోజు అపూర్వ స్వాగ‌తం ల‌భించింది. ఢిల్లీలో బ‌స చేసిన ట్రంప్ అండ్ ఫ్యామిలీ తన రెండో రోజు ప‌ర్య‌ట‌న‌లో ఢిల్లీలోని ప‌లు చారిత్రక ప్ర‌దేశాల‌ను సంద‌ర్శించారు. రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన ట్రంప్ దంప‌తులు, ఆ త‌ర్వాత రాజ్‌ఘాట్‌కు వెళ్లారు. స‌తీస‌మేతంగా రాజ్‌ఘాట్‌ను సందర్శించిన ట్రంప్ మహాత్ముడికి ఘ‌న నివాళులర్పించారు. బాపూజీ సమాధి వద్ద పుష్ఫ గుచ్ఛం ఉంచి..స‌మాధి చుట్టు ఇద్ద‌రు దంప‌తులు ఒక ప్రదక్షిణ చేశారు. తాను వెళ్లిన ప్ర‌తి చోట విజిట‌ర్స్ బుక్‌లో నోట్ రాస్తున్న ట్రంప్...రాజ్ ఘాట్ సంద‌ర్శ‌కుల పుస్తకంలోనూ మ‌హాత్ముడిని కొనియాడుతూ సందేశ‌మిచ్చారు.  
రాజ్ ఘాట్ వ‌ద్ద ట్రంప్, మెలానియాలు ఒక్క నిమిషం పాటు మౌనం పాటించి బాపూజీకి నివాళుల‌ర్పించారు. ``సార్వభౌమ, అద్భుతమైన భారత్ వెంట అమెరికా ప్రజలు బలంగా నిలబడతారు. ఇది మహాత్మా గాంధీ దూరదృష్టికి నిదర్శనం... ఇదే మేము ఆయనకిచ్చే గొప్ప గౌరవం’ అంటూ ట్రంప్ ఎమోష‌న‌ల్ మెసేజ్‌ని విజిట‌ర్స్ బుక్‌లో రాశారు. రాజ్ ఘాట్‌లో త‌న గుర్తుగా ట్రంప్ ఓ మొక్కను నాటారు అనంత‌రం ట్రంప్, మెలానియా దంపతులకు మహాత్మాగాంధీ జ్ఞాపికను కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ  అందజేశారు. ఆ త‌ర్వాత‌ హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోడీతో ద్వైపాక్షిక భేటీలో ట్రంప్ పాల్గొన్నారు. ఇరు దేశాల మ‌ధ్య ప‌లు కీల‌క‌మైన ఒప్పందాల‌పై ఇరువురు చ‌ర్చించారు.