​తెగించేశారుగా... మంగళరగిరిలో ఇల్లు కొనొద్దట

May 25, 2020

జగన్ ముఖ్యమంత్రి అయితే అభివృద్ధి ఆగిపోతుంది, పరిశ్రమలు రావు, ఏపీ చక్రం ముందుకు నడవదు అని చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో చెబితే తనకు అధికారం దక్కడం కోసం చంద్రబాబు అనవసరంగా నిందలు వేస్తున్నారని చాలా మంది వ్యాఖ్యానించారు. రాజకీయ నాయకులు ఎవరి స్వార్థం వారు చూసుకుంటారు అన్నారు. కానీ ఇపుడు చంద్రబాబు చెప్పిందే జరుగుతోంది. ఏపీలో ప్రభుత్వం మారిన వెంటనే... ఏపీలో పెట్టాలని నిర్ణయించుకున్న కొన్ని కంపెనీలు వెంటనే తమ నిర్ణయాన్ని వెనక్కుతీసుకున్నాయి. అయినా కూడా ప్రభుత్వం ఇంకా ఏపీ అభివృద్ధి నిరోధకులను ప్రోత్సహిస్తోంది. ఏపీ భవిష్యత్తును నాశనం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవడంలో దీంతో నెలంటే నెల రోజుల్లో జగన్... తన గురించి బాబు చెప్పింది నిజమని నిరూపించారు.
రాజధాని ప్రాంతం మంగళగిరిలో ఎవరూ ఇళ్లు కొనవద్దని స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రజలను దాదాపు బెదిరించినంత పనిచేశాడు. కొంటే కొనండి ఆ తర్వాత మీ ఇష్టం. ఇక్కడి భూముల బాగోతాలపై మేము దర్యాప్తు వేస్తాం. దీనిపై ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చి అన్నీ దర్యాప్తు చేయిస్తా అంటూ ఎమ్మెల్యే పిలుపు ఇస్తే... బుద్ధున్న వాడు ఎవరైనా అక్కడ భూములు కొంటారా? ప్రభుత్వం ప్రజలకు జాగ్రత్త చెప్పే విధానం ఇదేనా? రాజధానిని చంద్రబాబు కంటే ఉపయుక్తంగా తయారుచేస్తాం, ప్రతిదీ చట్టబద్ధమైన నిర్మాణం ఉండేలా చూస్తాం, కొనుగోళ్లు చేసే ముందు అన్ని అనుమతులు ఉన్నవే కొనండి అని ప్రజలకు జాగ్రత్త చెప్పాల్సిన ఎమ్మెల్యే... ఏకంగా కొనొద్దని బెదిరిస్తున్నారు. కనీసం ఆయన వ్యాఖ్యలపై ప్రభుత్వం మౌనం అర్థాంగీకారం అన్నట్టుంది. ఇప్పటికే దారుణంగా పడిపోయిన రియల్ ఎస్టేట్, ఇసుక ధరలు రెట్టింపు కావడంతో మరింత పడిపోయింది. తాజా బెదిరింపులతో అసలు అటువైపు చూసే నాథుడే కరవయ్యాడు. అంతా గమనిస్తుంటే... హైదరాబాదు రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకోవడానికి ఏపీ ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నట్టుంది గాని రాష్ట్ర ఆదాయం పెంచడానికి ప్రయత్నిస్తున్నట్టు లేదు. వైఎస్ హయాంలో రాష్ట్రంలో ప్రధాన ఆదాయాలు ... మద్యం అమ్మకాలు, రియల్ ఎస్టేట్. కానీ ఆ రెండింటినీ జగన్ పక్కన పెట్టేస్తానంటున్నాడు. అసలే ఆర్థిక లోటు, ఆపై కేంద్రం వెన్నుపోటు. ఇలా ఎమ్మెల్యేల బెదిరింపులు... ఇక ఏపీ ముందుకు పోయినట్టే.