ఇంత భ‌యంతో ప్ర‌భుత్వాన్ని ఎలా న‌డుపుతావు జ‌గ‌న్‌?

February 19, 2020

దేశంలో మ‌రే ముఖ్య‌మంత్రి తీసుకోని విధంగా...మొట్ట‌మొద‌టి సారి వైసీపీ అధినేత‌, ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. దేశంలోనే తొలిసారిగా త‌న కేబినెట్లో ఐదుగురిని ఉప ముఖ్య‌మంత్రులుగా నియ‌మించాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించారు. ఆంధ్రప్రదేశ్‌లో 25 మందితో పూర్తిస్థాయి కేబినెట్‌ను శనివారం ఏర్పాటు చేస్తామని ప్ర‌క‌టించిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి, ఇందులో ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉంటారని...ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సామాజిక వర్గాల నుంచి ఐదుగురికి ఆ అవకాశం కల్పిస్తామని వివ‌రించారు. త‌మకు మంత్రి పదవులు దక్కలేదని ఎవరూ అసంతృప్తి చెందొద్దని సూచించిన సీఎం జగన్.. రెండున్నరేళ్ల తర్వాత 90 శాతం మంత్రులను మారుస్తామని స్పష్టం చేశారు. అయితే, జ‌గ‌న్ ఈ నిర్ణ‌యాలు తీసుకోవ‌డం వెనుక కుల స‌మీక‌ర‌ణాలు కార‌ణ‌మా లేక‌పోతే...నాయ‌కులంటే ఆయ‌న‌కు ఉన్న భ‌యం కార‌ణ‌మా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది. 

ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 151, టీడీపీ 23, జనసేన 1 స్థానంలో గెలిచింది.మే 30వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా వైఎస్‌ జగన్‌ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. త‌న ప్ర‌మాణ‌స్వీకారం అనంత‌రం మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ చేస్తాన‌ని ప్ర‌క‌టించిన జ‌గ‌న్ తాజాగా ఐదుగురు ఉప‌ముఖ్య‌మంత్రులుంటార‌ని ప్ర‌క‌టించ‌డం ద్వారా సంచ‌ల‌నం సృష్టించారు. మ‌రోవైపు అదే రీతిలో రెండున్న‌రేళ్ల త‌ర్వాత మంత్రుల‌ను మారుస్తాన‌ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అయితే, జ‌గ‌న్ ఎందుకు ఈ ప్ర‌క‌ట‌న చేశార‌నేది ఆస‌క్తిని రేకెత్తించింది. జ‌గ‌న్ తీసుకున్న  ఈ నిర్ణ‌యాల‌ వెనుక పార్టీ నేత‌ల నుంచి వ్య‌క్త‌మ‌య్యే అసంతృప్తికి అడ్డుక‌ట్ట వేయాల‌నే ల‌క్ష్య‌ముంద‌ని అంటున్నారు. పార్టీ కోసం మొద‌టి నుంచి శ్ర‌మిస్తున్న నేత‌లు...వివిధ పార్టీల నుంచి వ‌చ్చిన సీనియ‌ర్లు...తాజా ఎన్నిక‌ల్లో గెలిచిన ముఖ్య నేత‌లు ఇలా...అన్నివ‌ర్గాల వారు మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌పై ఆశ‌పెట్టుకున్న నేప‌థ్యంలో...జ‌గ‌న్ ఈ ఎత్తుగ‌డ వేశారంటున్నారు. 

కులాల వారీగా ఎన్నిక‌ల స‌మ‌యంలో హామీ ఇచ్చిన జ‌గ‌న్ వారంద‌రినీ సంతృప్తి ప‌రిచేందుకే...ఉప‌ముఖ్య‌మంత్రి ప‌ద‌వుల‌ను తెర‌మీద‌కు తెచ్చార‌ని అంటున్నారు. ఇందులో భాగంగానే దేశంలో మ‌రెక్క‌డా లేని రీతిలో ఐదుగురు ఉప‌ముఖ్య‌మంత్రుల‌ను నియ‌మిస్తున్నార‌ని చెప్తున్నారు. మ‌రోవైపు, పార్టీ నేత‌ల్లో అసంతృప్తి ఏర్ప‌డే అవ‌కాశం లేకుండా...రెండున్న‌రేళ్ల త‌ర్వాత మంత్రుల‌ను మారుస్తాన‌నే మాట‌ను జ‌గ‌న్ చెప్పార‌ని ప‌లువురు విశ్లేషిస్తున్నారు. 90 శాతం మంత్రులను మారుస్తామని కీలక ప్ర‌క‌ట‌న చేయ‌డం ద్వారా  జ‌గ‌న్ ప్ర‌స్తుతం ప‌ద‌వులు పొందిన నేత‌ల్లో ఒకింత భ‌యం సృష్టించార‌ని విశ్లేషిస్తున్నారు. అయితే, ఇంత భ‌య‌ప‌డుతూ జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ఎలా న‌డుపుతార‌ని...కొంద‌రు కామెంట్లు చేస్తున్నారు.