రాహుల్ 'కేరాఫ్ అడ్ర‌స్' మీద కొత్త అనుమానాలు!

April 02, 2020

ఆయ‌న మామూలు వ్య‌క్తి కాదు. ఏకంగా భార‌తదేశ ప్ర‌ధాని సీటును చేజిక్కించుకోవ‌టానికి త‌పిస్తున్న ప్ర‌ముఖ పార్టీ అధినేత‌. ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌టం కొత్త కాదు. ఇప్ప‌టికే ఎంపీగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఆయ‌న జాతీయ‌త మీద‌నే అనుమానాలు వ్య‌క్త‌మ‌య్యే ఫిర్యాదు ఒక‌టి తెర మీద‌కు వ‌చ్చింది. ఇంత‌కీ ఆయ‌న ఎవ‌రో కాదు. అఖిల భార‌త కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ. తాజాగా ఆయ‌నకు భార‌త పౌర‌స‌త్వానికి బ‌దులు బ్రిటిష్ పౌరుడని.. ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌టానికి వీల్లేదంటూ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న అభ్య‌ర్థి ఒక‌రు కొత్త అభ్యంత‌రాన్ని లేవ‌నెత్తారు.
బ్రిట‌న్లో రిజిస్ట‌రైన ఒక కంపెనీలో పేర్కొన్న స‌మాచారం ప్ర‌కారం.. అందులో రాహుల్ త‌న‌ను తాను బ్రిటిష్ పౌరుడిగా ప్ర‌క‌టించుకున్నార‌ని.. ప్ర‌జా ప్రాతినిధ్య చ‌ట్టంలోని నిబంధ‌న‌ల ప్ర‌కారం భార‌త పౌర‌స‌త్వం లేని వారు ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌టానికి అర్హ‌త లేదంటూ ధ్రువ్ లాల్ అనే అభ్య‌ర్థి చేసిన ఫిర్యాదు ఒక‌టి కొత్త లొల్లికి కార‌ణ‌మైంది.
తాను బ్రిటిష్ పౌరుడిగా పేర్కొన్న కంపెనీకి సంబంధించిన ఆస్తులు... లాభాల వివ‌రాల్ని ఆ అఫిడ‌విట్ లో రాహుల్ పేర్కొన‌లేద‌న్నారు. ఇదొక్క‌టే కాదు.. రాహుల్ విద్యార్హ‌త‌ల మీద త‌ప్పులు ఉన్నాయ‌ని.. ఒరిజిన‌ల్ ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు స‌మ‌ర్పించాల‌ని.. అప్పుడు మాత్ర‌మే రాహుల్ వాద‌న‌ను న‌మ్ముతామంటున‌నారు.
రాహుల్ గాంధీ.. రౌల్ విన్నీ ఒక్క‌రేనా? కాకుంటే రాహుల్ విద్యార్హ‌త‌కు సంబంధించిన అస‌లు ప‌త్రాలు స‌మ‌ర్పించాల‌ని తాము డిమాండ్ చేస్తున్న‌ట్లుగా ఆయ‌న ఎన్నిక‌ల క‌మిష‌న్ కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో స్పందించిన రిట‌ర్నింగ్ అధికారి.. ఈ అంశంపై విచార‌ణ‌ను సోమ‌వారానికి వాయిదా వేశారు.
కొత్త‌గా తెర మీద‌కు వ‌చ్చిన అంశాల మీద వివ‌ర‌ణ ఇవ్వాల్సిందిగా రాహుల్ గాంధీని ఈసీ వివ‌ర‌ణ కోరింది. సోమ‌వారం ఉద‌యం 10.30 గంట‌ల లోపు వివ‌ర‌ణ ఇవ్వాల్సిందిగా పేర్కొన్నారు. నిజానికి రాహుల్ కు సంబంధించి అడిగిన వివ‌రాలు చాలా సింఫుల్ వి.. ప్రాధ‌మిక‌మైన‌వి. కానీ.. వాటికి ఇవ్వాల్సిన వివ‌ర‌ణ కోసం రాహుల్ న్యాయ‌వాది సోమ‌వారం వ‌ర‌కూ స‌మ‌యం అడ‌గ‌టాన్ని ప్ర‌స్తావించి కొత్త అనుమానాల్ని తెర మీద‌కు తెచ్చారు బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ న‌ర‌సింహ‌రావు.
ఇప్ప‌టివ‌ర‌కూ రాహుల్ ను ఉద్దేశించిన చేసిన విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌ల‌కు భిన్న‌మైన వాద‌న‌ను తెర మీద‌కు తీసుకురావ‌టంలో బీజేపీ స‌క్సెస్ అయ్యింద‌ని చెప్పాలి. రాహుల్ కు సంబంధించిన మౌలిక అంశాల విష‌యంలో స‌గ‌టు జీవికి సైతం కొత్త సందేహాలు పుట్టేలా చేయ‌టంలో బీజేపీ విజ‌య‌వంత‌మైంద‌న్న మాట వినిపిస్తోంది. రాహుల్ భార‌తీయుడా? బ్రిటీష‌రా? ఆయ‌న పేరు రాహుల్ గాంధీ కాకుండా మ‌రో పేరుగా వ్య‌వ‌హ‌రిస్తారా? ఆయ‌న‌కు బ్రిట‌న్ కంపెనీలో వాటా ఉందా? ఆయ‌న విద్యార్హ‌త మీద వినిపించే విమ‌ర్శ‌ల్లో ప‌స ఉందా? లాంటి కొత్త సందేహాల‌కు తెర తీసేలా చేయ‌టంలో రాహుల్ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు ప్ర‌స్తుతానికి స‌క్సెస్ అయిన‌ట్లే.