డాక్టర్ అనితా రాణి కేసులో కొత్త ట్విస్ట్

August 11, 2020

ఏపీ అధికారపక్షంపై వస్తున్న విమర్శలు.. ఆరోపణలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాలతో చోటుచేసుకునే సంచలనాలు ఒక ఎత్తు అయితే.. ఆయన పార్టీకి చెందిన కొందరి తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇటీవల ఒక మహిళా వైద్యురాలి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం వేధింపులకు గురి చేస్తున్న వైనం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ వెలుగు చూసినంతనే స్పందించిన సీఎం జగన్.. ఆ ఇష్యూ క్లోజ్ అయ్యేలా చేయలేకపోయారన్న మాట వినిపిస్తోంది.

ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న అక్రమాల్ని ప్రశ్నించినందుకే తనను వేధిస్తున్నారని డాక్టర్ అనితారాణి ఆరోపిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అనుచరుల నుంచి తనకు వేధింపులు పెరుగుతున్నట్లుగా ఆమె ఆరోపిస్తున్నారు.  

తాజాగా ఆమె హైకోర్టును ఆశ్రయించారు. తనకు ఎదురవుతున్న వేధింపులపై పోలీసులకు కంప్లైంట్ చేసినా ఫలితం లేదన్న ఆమె.. తాను ఎదుర్కొంటున్న ఇబ్బందుల మీద ప్రభుత్వం సీఐడీ దర్యాప్తునకు ఆదేశించిందన్నారు.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీఐడీ అధికారులు ఇప్పటివరకూ తన వద్దకు రాలేదన్న అనితారాణి.. తన వాంగ్మూలం తీసుకోకుండా తన ఆరోపణల్లో వాస్తవం లేదని ఎలా తేలుస్తారని ప్రశ్నిస్తున్నారు. హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో.. కోర్టు ఎలా రియాక్టు అవుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.