Dr లీ ముందుచూపు: మనకిప్పుడు అవసరం

August 13, 2020

33 ఏళ్ళ 'లి వెన్లియాంగ్' వుహాన్ సెంట్రల్ హాస్పిటల్‌లో వైద్యుడు. హువానన్ సీఫుడ్ మార్కెట్ నుండి వచ్చిన ఏడుగురు రోగులను పరీక్షించినప్పుడు అతను మొదటిసారి కరోనా వైరస్ ను గుర్తించాడు. 30 డిసెంబర్ 2019 న తన తోటి ఉద్యోగులతో గ్రూప్ చాట్ ద్వారా ఈ విషయాలను పంచుకున్నాడు. "మనుషులలో కరోనా వైరస్ ను గుర్తించానని, ఇది ప్రమాదకరమైన అంటువ్యాధి అని, మిత్రులందరూ వీలైనంత రక్షణ చర్యలు తీసుకోవాలని వారి కుటుంబాలకు, స్నేహితులకు తెలియజేయాలని కోరారు". అలాగే పేషేంట్ రిపోర్ట్స్, సిటి స్కాన్ ఇమేజ్‌ను తన గ్రూపులో పోస్ట్ చేశాడు. కానీ ఈ విషయం గ్రూప్ లో నుండి బయటకు వచ్చి, ఒక్కసారిగా చైనీస్ సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపింది.

జనవరి 3 న, వుహాన్ పోలీసులు లీని నిర్బంధించి ఇంటర్నెట్‌లో అసత్యాలు ప్రచారం చేస్తున్నాడన్న నెపంతో విచారించారు, మరొకసారి ఇలా జరిగితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించి లీ సంతకాలు తీసుకుని పంపేశారు. అతని మాటల్ని స్థానిక ప్రభుత్వ ఆరోగ్య సంస్థలు అంత సీరియస్ గా తీసుకోలేదు.

లీ ఊహించినట్లు కొన్ని రోజుల్లోనే వుహాన్ ప్రాంతంలో కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాపించడం మొదలుపెట్టింది. జనవరి 7 న ఆసుపత్రిలో ఒక రోగిని పరీక్షిస్తున్నప్పుడు లీ కి కూడా కరోనావైరస్ సంక్రమించింది. జనవరి 12 న లి ఇంటెన్సివ్ కేర్‌లో చేరినా అతని ఆరోగ్యం విషమించి 7 ఫిబ్రవరి 2020 న తెల్లవారుజామున మరణించాడు. లి మరణించే నాటికి ఒక బిడ్డ ఉండగా అతని భార్య గర్భవతి.

వుహాన్ పౌరులు సెంట్రల్ హాస్పిటల్‌లో పువ్వులు ఉంచి 'లీ' కి ఘన నివాళులు అర్పించారు. అక్కడ ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో అన్ని లైట్లను ఐదు నిమిషాలు ఆపివేసారు, మరణించిన కొద్ది గంటల్లోనే, వుహాన్ మునిసిపల్ మరియు ఆరోగ్య కమిషన్ లికి నివాళి మరియు అతని కుటుంబానికి సంతాపం ప్రకటించాయి. కొందరైతే అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లిని మందలించినందుకు వుహాన్ ప్రభుత్వం అధికారికంగా క్షమాపణలు చెప్పింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ట్విట్టర్‌లో తన ఆవేదనను పంచుకుంది.

మానవాళికి రాబోయే పెను ప్రమాదాన్ని ముందుగా అంచనా వేసి ప్రజలను అప్రమత్తం చెయ్యడానికి ప్రయత్నించి, ఆ ప్రయత్నంలో తన ప్రాణాలను సైతం పోగొట్టుకున్న లీ చిరస్మరణీయుడు. లీ చేసిన హెచ్చరికలను తేలికగా తీసుకున్న చైనా ఎలా అతలాకుతలం అయిందో, ప్రపంచానికెంతటి ముప్పు వచ్చిందో అందరమూ చూస్తున్నాం. నిజానికి ప్రపంచ యుద్ధం ప్రత్యక్షంగా జరిగినా ఇంత భయానకమైన వాతావరణం ఉండేది కాదేమో.

ఇప్పుడు కరోనా వైరస్ మెల్లగా భారత్ లోకి చాపకింద నీరులా వ్యాపిస్తుంది. మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుని అతి భయంకరమైన కరోనా వ్యాప్తిని ఇండియాలో అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. మన ప్రజలమందరం మరింత బాధ్యతతో ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ అత్యంత జాగురూకతతో ఉండాల్సిన సమయమిది. ఏ మాత్రం అశ్రద్ధ చెయ్యకూడదని మిత్రులందరికీ నా విన్నపం.

మన భారతీయులమందరం ఇప్పుడు కుల, మత, ప్రాంత, వర్గ, భావోద్వేగ, రాజకీయాలకతీతంగా ఐకమత్యంగా ఉండాల్సిన సమయమిది. భవిష్యత్తులో నన్ను మీరు చూడాలన్నా, మిమ్మల్మి నేను చూడాలన్నా అందరం ఆరోగ్యంగా ఉండాల్సిందే, కరోనా మహమ్మారిని నిర్మూలించాల్సిందే. ఆరోగ్య భారతావనిని కాపాడుకోవాల్సిందే. జై భారత్.

 

RELATED ARTICLES

  • No related artciles found