జగన్ సర్కారు అనుకున్నదొకటి... అయినదొకటి

August 06, 2020

సీఎం జగన్ నేతృత్వంలోని ఏపీ సర్కార్ తీసుకుంటున్న పలు నిర్ణయాలు వివాదాస్పదమవుతోన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ కార్యాలయాలకు రంగుల వ్యవహారం, నిమ్మగడ్డ తొలగింపు విషయం, డాక్టర్ సుధాకర్ అరెస్టు వంటి విషయాలలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ మూడు విషయాల్లోనూ ప్రభుత్వానికి హైకోర్టు అక్షింతలు వేసింది.

తాజాగా డాక్టర్ సుధాకర్ వ్యవహారంలోనూ ప్రభుత్వానికి అక్షింతలు పడ్డాయి. హైకోర్టు ఆదేశాల ప్రకారం విశాఖ మానసిక వైద్యశాలలో చికిత్స పొందుతున్న డాక్టర్ సుధాకర్ ను విడుదల చేశారు. తనను డిశ్చార్జ్ చేయాలంటూ కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు డాక్టర్ సుధాకర్ లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే సుధాకర్ ను డిశ్చార్జ్ చేశారు.

తన కుమారుడిని ఆసుపత్రిలో అక్రమంగా నిర్బంధించారని, సంబంధంలేని మందులు ఇస్తున్నారని సుధాకర్ తల్లి కావేరీ బాయి కోర్టును ఆశ్రయించారు. తన కుమారుడిని హైకోర్టులో హాజరు పరిచాలంటూ హెబియస్ కార్పస్ హౌస్ మోషన్ పిటిషన్‌ దాఖలు చేశారు. దానిపై విచారణ జరిపిన హైకోర్టు సుధాకర్ ను డిశ్చార్జ్ చేయాలని ఆదేశించింది. సుధాకర్ పోలీసు కస్టడీలో లేరని, మెరుగైన వైద్యం కోసం విశాఖ మానసిక వైద్యశాలకు తరలించామని  ప్రభుత్వం తరపు న్యాయవాది  తెలిపారు.

సుధాకర్  డిశ్చార్జ్ పై తమకు అభ్యంతరం లేదన్నారు. సుధాకర్ తమ కస్టడీలో లేరని  సీబీఐ  తెలిపింది. దీంతో, సుధాకర్ ను డిశ్చార్జ్ చేయాలని ఆదేశించిన హైకోర్టు... సీబీఐ దర్యాప్తునకు సుధాకర్ సహకరించాలని కోరింది. సుధాకర్‌కు వేరే ఆసుపత్రిలోనైనా చికిత్స అందించాల్సిన అవసరముందని ఆసుపత్రి వైద్యులు సుధాకర్ కుటుంబ సభ్యులకు సూచించారు.