హైకోర్టుకు డాక్టర్ సుధాకర్ !

August 13, 2020

బాధ్యతగా తను పనిచేస్తున్న ఆస్పత్రికి అవసరమైన కిట్లు, పరికరాల కోసం మీడియా ద్వారా ప్రశ్నించిన ఒక వైద్యుడిని ఆస్పత్రి పాలు చేసిన ఘనత జగన్ ప్రభుత్వానిది. తదనంతర దుశ్చర్యలతో జగన్ సర్కారు బోనులో నిలబడాల్సి వచ్చింది. అతని కేసును ఏకంగా సీబీఐకి అప్పగించింది హైకోర్టు. అయితే... ఇదంతా సుమోటోగా స్వీకరించి హైకోర్టు చేసింది.

తాజాగా స్వయంగా డాక్టరు సుధాకర్ హైకోర్టును ఆశ్రయించారు. విశాఖ మానసిక ఆసుపత్రిలో తనకు అవసరం లేని వైద్యం చేసి, అవసరం లేని మందుు అందిస్తూ తనను రోగిలా మారుస్తున్నారని కోర్టుకు  తెలిపారు. తనకు సరైన వైద్యం అందడం లేదని వెంటనే వేరే ఆస్పత్రికి తరలించాలని కోర్టును కోరారు. 

తాను బతకాలంటే కోర్టు పర్యవేక్షణలో తనకు వైద్యం జరగాలని డాక్టర్ సుధాకర్ కోర్టుకు విజ్జప్తి చేశారు. సుధాకర్ తరఫున న్యాయవాది శ్రావణ్ కుమార్ కోర్టుకు పలు విజ్జప్తులు చేశారు. సుధాకర్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని... కేవలం పోలీసులు కొట్టిన దెబ్బలకు మాత్రమే ఇపుడు ఆయనకు వైద్యం అవసరమని కోర్టుకు తెలిపారు. 

మానసిక వ్యాధి లేని సుధాకర్ కు మానసిక వ్యాధికి ఇచ్చే మాత్రలు ఇచ్చారని వాటి వివరాలను కోర్టుకు తెలిపారు. అతడి మీద పిచ్చోడని ముద్ర వేయడానికి ప్రభుత్వ ప్రయత్నం చేస్తోందని, దీనికి అతనికి ఇస్తున్న మందులే సాక్ష్యం అని ఆయన తెలిపారు. సుధాకర్ ను మానసిక ఆస్పత్రికి తరలించడంలోనే కుట్ర ఉందని మాకు అనుమానంగా ఉందని న్యాయవాది వివరించారు.