హైకోర్టు సంచలనం... సుధాకర్ కేసు సీబీఐకి

August 06, 2020

ఏపీ హైకోర్టు డాక్టరు సుధాకర్ కేసులో సంచలన ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం నివేదికలేవీ నమ్మకం కలిగించేలా లేనందున సుధాకర్ కేసులో ప్రభుత్వం కుట్ర ఉందని మాకు అనిపిస్తుంది,  అందుకే ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నాం అని హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. నాలుగు రోజులుగా వరుసగా సుధాకర్ కేసును విచారిస్తున్న ఏపీ హైకోర్టు ప్రభుత్వ నివేదికను తెప్పించుకుంది. అనంతరం జిల్లా మెజిస్ట్రేటును సుధాకర్ ఉన్న ఆస్పత్రికే పంపించి వాంగ్మూలం నమోదు చేయించింది. 

అయితే, ఈ రెండు నివేదికలు పరిశీలించిన హైకోర్టు... మెజిస్ట్రేటు నివేదికలో ఒంటిపై గాయాలున్నాయని స్పష్టంగా నమోదు చేసి ఉంది. కానీ ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో ఒంటిపై ఉన్న గాయాల ప్రస్తావన లేదు. ఇందులో ప్రభుత్వం ఏదో దాస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ప్రభుత్వంలో దురుద్దేశాలు కనిపిస్తున్నాయి అని ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆ వెంటనే కేసును సీబీఐకి అప్పగిస్తూ 8 వారాల్లోపు విచారణ పూర్తి  నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. 

హైకోర్టు నిర్ణయం ప్రభుత్వానికి, అధికార పార్టీకి మంట పుట్టించింది. కేవలం మాస్కులడిగినందుకు సస్పెండ్ చేసిన విషయం అందరికి తెలిసిందే. దానిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఎపుడైతే ఒక డాక్టరును రోడ్డుపై అత్యంత దారుణంగా అవమానించిందో అపుడు సమాజం మొత్తం ప్రభుత్వాన్ని విమర్శించింది. డాక్టరు తాగి ఉన్నాడని చెబుతున్నా... తాగడం దేశంలో నేరం కాదు, కేవలం తాగి వాహనం రోడ్డు మీద ఆపిన నేరానికి ఉగ్రవాదులను డీల్ చేసినట్టు చేయడాన్ని ఎవరూ సహించలేకపోయారు. ఐఎంఏ డాక్టరుపై దాడిని తీవ్రంగా తప్పు పడుతూ జగన్ కి లేఖ రాసింది. 

ఇదిలా ఉండగా... డాక్టరు సుధాకర్ తల్లి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం మాతో సంప్రదింపులు మొదలుపెట్టిందని, కేసులు వెనక్కు తీసుకుంటే ఉద్యోగం తిరిగి ఇస్తాం అని చెబుతోందని చెప్పింది. అయితే, ప్రభుత్వం మమ్మల్ని రోడ్డున పడేసి ఒంటరి చేసినపుడు మాకు ఎందరో అండగా నిలిచారు. మేము వెనక్కు తగ్గితే వారిని అవమానించినట్టు. అందుకే దీనిపై పోరాటానికే నిశ్చయించుకున్నాం అని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ 420 కేసులున్నవాళ్లు పాలకులు అయితే కోర్టులే పాలించాల్సి వస్తుందని సుధాకర్ కేసులో హైకోర్టు తీర్పును తన ట్విట్టరులో షేర్ చేస్తూ ఆమె వ్యాఖ్యానించారు.

దళితులను లొంగదీసుకోవడానికి జగన్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని, జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వైసీపీ పాలనలో దళితులపై దాడులు పెరిగాయని టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ ఆరోపించారు. డాక్టర్ సుధాకర్ విషయంలో ప్రభుత్వం దారుణంగా వ్యవహరించిందని మండిపడ్డారు.