ఏపీ: డాక్టరును తాళ్లతో కట్టి, లాఠీలతో కొట్టారు

August 15, 2020

ముఖ్యమంత్రి జగన్ ను ప్రశ్నించిన వారికి ఘోర దుష్పరిణామాలు తప్పవని మరోసారి రుజువైంది. ఒక డాక్టరును అర్దనగ్నంగా రోడ్డు మీద ఏపీ పోలీసులు తాళ్లతో కట్టి లాఠీలతో బాదారు. ఇది ప్రజస్వామ్యదేశమేనా? రాజ్యాంగం అనేది ఒకటుందా? ఇంత నియంతృత్వమా? ఏపీలో ఏం జరుగుతోంది? 

కొన్ని రోజుల క్రితం బోండా ఉమ, బుద్ధా వెంకన్నల కారుపై ఆయుధాలతో దాడిచేసి కారును ధ్వంసం చేసిన వ్యక్తిని పోలీసు స్టేసనులో రాచమర్యాదలు చేసి బెయిలు ఇచ్చి పంపారు. కానీ మాస్కులు లేవని అడిగినందుకు తన తప్పు ఏమీ లేకుండా ఒక దళిత వైద్యుడిని అడ్డంగా సస్పెండ్ చేశారు. అడిగేవాడే లేడు. మళ్లీ ఈరోజు సాయంత్రం పట్టపగలు అందరూ చూస్తుండగానే ప్రభుత్వ వైద్యుడు అయిన సుధాకర్ ను తాళ్లతో కట్టేసి లాఠీలతో బాదారు పోలీసులు. నడిరోడ్డుపై పడుకోబెట్టారు. కనీసం ఒక సాధారణ మనిషి కి ఇచ్చిన మర్యాద కూడా ఇవ్వలేదు. అతని చేసిన తప్పు తాగి ఉండటమే. తాగి ఉండటం నేరం కాదే ఈ దేశంలో. మరి ఏ నేరమైనా... తాళ్లతో ఒక ప్రభుత్వ వైద్యుడు చేతులు కట్టేసే అధికారం ఈ పోలీసులకు ఎవరిచ్చారు?

తనకు ప్రజలందరూ  సమానమే, పార్టీ లేదు కులం లేదు అని సీఎం జగన్ చెప్పేవన్నీ మాటలే తప్ప చేతల్లో సున్నా అని ఈ దుర్ఘటన నిరూపించింది. 

హత్య కేసు నిందితులకు కూడా వేయని శిక్షను వేశారు పోలీసులు. ప్రజల మధ్యే ఇంత అరాచకంగా వ్యవహరిస్తే ఇక స్టేషన్లో తెలుగుదేశం వారితో పోలీసులు ఎలా వ్యవహరిస్తారో అన్నదానికి ఇదొక మచ్చుతునక అని చెప్పొచ్చు.