ఏపీ ప్ర‌భుత్వానికి ర‌వి వేమూరి సంచ‌ల‌న స‌వాల్‌ !!

February 24, 2020

న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజధాని విష‌యంలో అసెంబ్లీలో చ‌ర్చ సంద‌ర్భంగా, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ టీడీపీ నేత‌లు, వారి స‌న్నిహితులు రాజ‌ధానిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్ప‌డ్డార‌ని ఆరోపించ‌డం సంచ‌ల‌నంగా మారింది. బుగ్గ‌న ఆరోపించిన వారిలో ఏపీఎన్‌ఆర్‌టి సొసైటీ మాజీ అధ్యక్షులు వేమూరు రవికుమార్ సైతం ఉన్నారు. అయితే, త‌న‌పై వ‌చ్చిన‌ ఆరోపణలు నిరూపిస్తే... ఆ భూములు ప్రభుత్వానికి రాసిస్తాన‌ని వేమూరు రవికుమార్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈ మేర‌కు తాజాగా ఆయ‌న ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.
``రాజధాని అమరావతి ప్రాంతంలో నేను 500 ఎకరాలు కొనుగోలు చేసి రూ. 650 కోట్ల లబ్ది పొందానని కొందరు గత మూడు సంవత్సరాలుగా ప్రచారం చేస్తున్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ గారు అసెంబ్లీలో మాట్లాడుతూ “నారా లోకేష్ సన్నిహితుడు, ఆయన వ్యాపార భాగస్వామి వేమూరు రవి కుమార్‌ ప్రసాద్‌ 25. 68 ఎకరాలు కొనుగోలుచేసి” ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కి పాల్పడ్డానని పేర్కొన్నారు. ఈ ఆరోపణలన్నీ పూర్తి అబద్దాలేనని స్పష్టం చేస్తున్నాను.`` అని వేమూరు రవికుమార్ తేల్చిచెప్పారు.
అమరావతి ప్రాంతంలో నేను ఏప్రిల్‌ 2004 మరియు 2005 సంవత్సరాలలో అంటే 15 సంవత్సరాల క్రితం 6.30 ఎకరాలు కొనుగోలు చేశాను. అప్పటి నుండి సెప్టెంబర్‌ 4, 2014లో రాజధాని ప్రకటన వచ్చేవరకు ఏ భూములు కొనలేదు. రాజధాని ప్రకటన జరిగిన తరువాత 9.86 ఎకరాలు కొన్నాను. మొత్తం నా కుటుంబానికి ఉంది 16.16 ఎకరాలు మాత్రమే. అందులో 6 ఎకరాలు రాజధాని పరిధికి వెలుపల ఉంది. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా రాజధాని ప్రకటనకు ముందు నేను భూములు కొనుగోలు చేశానని నిరూపిస్తే ఆ భూములను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రభుత్వానికి అప్పగించడానికి నాకు అభ్యంతరం లేదు.`` అంటూ త‌న‌పై జ‌రుగుతున్న ప్ర‌చారానికి ఘాటు కౌంట‌ర్ ఇచ్చారు వేమూరు రవికుమార్‌.
``ఇది కాక నాకు 10% కంటే తక్కువ భాగస్వామ్యం ఉన్న కంపెనీలు కొనుగోలు చేసిన భూములను కూడా కలిపి ఆర్థిక మంత్రి బుగ్గన గారు మొత్తం 25.66 ఎకరాలు నా పేరుతో ఉన్నట్లు పేర్కొన్నారు. పైగా ఆయా కంపెనీలు కొనుగోలు చేసిన భూములు కూడా రాజధాని ప్రకటన తర్వాత కొనుగోలు చేశారే తప్ప... ప్రకటనకు ముందు కాదు. నేను మరొకరికి బినామీగా ఉండవలసిన అవసరము లేదు. విదేశాలలో నా వృత్తి, వ్యాపారాలలో సంపాదించిన సొమ్ముతోనే ఈ భూములు కొనుగోలు చేశాను. అదే విధంగా నేను మరొకరిని బినామీలుగా ఉంచుకోవాల్సిన అవసరం కూడా లేదు. నాకు నారా లోకేష్‌ గారికి మధ్య వ్యాపార లావాదేవీలు ఉన్నాయని నిరూపిస్తే ఆ వ్యాపారాలను రాష్ట్ర ప్రభుత్వానికి రాసిచ్చేందుకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. విదేశాలలో ఉన్న తెలుగు వారికి ర్యాష్ట్రంతో అనుబంధం పెంచడానికి ఏపీఎన్‌ఆర్‌టీ సంస్థ ద్వారా అప్పటి ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఐటీ మరియు ఇతర సంస్థలు రాష్ట్రానికి రావడానికి, యువతకు ఉపాధి కలిపించడానికి నా శక్తి మేరకు ప్రయత్నించాను. అటువంటి నాపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని ఆపవలసిందిగా కోరుతున్నాను.`` అని వేమూరు రవికుమార్ స్ప‌ష్టం చేశారు.