మొబైల్స్, ల్యాప్ టాప్స్, కరెన్సీ నోట్లూ ఇట్టే శానిటైజ్

August 14, 2020

ప్రాణాంతక వైరస్ కరోనా విస్తృతి నేపథ్యంలో ఇప్పుడు అంతటా శానిటైజేషన్ మాటే ఎక్కువగా వినిపిస్తోంది. అప్పటిదాకా కేవలం వైద్యులు మాత్రమే వాడే శానిటైజర్లు ఇప్పుడు అందరూ వాడాల్సిన పరిస్థితి. సరే... మన చేతులను మాత్రమే శానిటైజ్ చేసుకుంటే... ఇక మన నిత్య జీవితంలో తప్పనిసరి వస్తువులుగా మారిన మొబైల్ ఫోన్ల పరిస్థితి ఏమిటి? కరెన్సీ నోట్ల శానిటైజేషన్ ఎలా?

ఇదే ఆలోచన వచ్చిన కేంద్ర ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ డిఫెన్స్ రీసెర్చీ అండ్ డెవలప్ మెంట్ ఆర్గపైజేషన్ (డీఆర్డీఓ)  మనం నిత్యం వాడుతున్న ఎలక్ట్రానిక్ గూడ్స్ తో పాటు కరెన్సీ నోట్ల శానిటైజేషన్ కోసం ఏకంగా ఓ కొత్త పరికరాన్నే తయారు చేసింది. డిఫెన్స్ రీసెర్చీ ఆల్ట్రావాయెలెట్ శానిటైజర్ (డ్రువ్స్) పేరిట రూపొందిన ఈ పరికరం నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది.

డీఆర్డీఓ హైదరాబాద్ యూనిట్ లో పనిచేస్తున్న ఇద్దరు శాస్త్రవేత్తలు గోపీనాథ్, సౌరవ్ కుమార్ ల చేతుల్లో రూపొందిన ఈ పరికరం త్వరలోనే మనకు అందుబాటులో రానుంది. ఈ పరికరం క్షణాల్లోనే మన మొబైల్ ఫోన్లతో పాటు ల్యాప్ టాప్ లు, ఐపాడ్ లు, కరెన్సీ నోట్లు, చలాన్లు, చెక్కులు, పాస్ బుక్కులు, పేపర్ కవర్లు తదితరాలను క్రిమి రహితంగా మార్చేస్తుంది.

అది కూడా మన చేతులతో ఎలాంటి పని లేకుండానే ఈ పరికరం శానిటైజ్ చేసేస్తుంది. మనం శానిటైజ్ చేసుకోవాలనుకునే పరికరాలను ఈ పరికరంలో అలా పెట్టేస్తే... ఇలా అవన్నీ క్షణాల్లో శానిటైజ్ అయిపోతాయట. అంతా ఆటోమేటిక్ గా జరిగే ఈ ప్రక్రియను డ్రువ్స్... సూర్యరశ్మిలోని అతి నీలలోహిత కిరణాల సాయంతో పూర్తి చేస్తుందట.

గోపీనాథ్, సౌరవ్ కుమార్ లు రూపొందించిన డ్రువ్స్ పరికరం పనితీరును హైదరాబాద్ లోని వైరాలజీ ల్యాబ్ ఇప్పటికే పరీక్షించి... దాని వివరాలను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కూడా వివరించిందట.

మొత్తంగా ఈ పరికరం ఉత్పత్తికి కేంద్రం నుంచి అనుమతి రాగానే.. దాని ఉత్పత్తిని హైదరాబద్ లోని శాంతి నగర్ లో ఉన్న విజయ్ మెషీన్ టూల్స్ కు అప్పజెప్పారట. విజయ్ మెషీన్ టూల్స్ ఈ పరికరాన్ని రూ.55 వేలకు విక్రయించే అవకాశాలున్నట్లుగా తెలిపిందని గోపీనాథ్ తెలిపారు.

అయితే కరోనా వైరస్ నేపథ్యంలో ఈ పరికరాన్ని మరింత తక్కువ ధరకే అందించేలా చర్చలు జరుగుతున్నాయని, మరో మూడు నెలల్లోనే ఈ పరికరం అందుబాటులోకి రానుందని వివరించారు.