చంద్రబాబు ఇంటిపై ఎగిరిన డ్రోన్లు.. హైటెన్షన్

May 24, 2020

తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసంపై డ్రోన్లు ఎగరడంతో కలకలం రేగింది. కృష్ణా నదికి వరద ఉద్ధృతి నేపథ్యంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు చంద్రబాబు నివాసంపైకి డ్రోన్ ను ప్రయోగించారు. ఈ విషయాన్ని గుర్తించిన టీడీపీ కార్యకర్తలు వారిని పట్టుకుని ప్రశ్నలు వేశారు. కొద్దిసేపటికే అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని తాము అదుపులోకి తీసుకుంటున్నట్లు చెప్పారు.
తాము జలవనరుల శాఖ అధికారులమని సదరు వ్యక్తులు చెప్పినా అందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలను వారు చూపలేదు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేత దేవినేని అవినాష్, టీడీ జనార్ధన్ తో పాటు టీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో అక్కడికి వచ్చేశారు. వీరిని పోలీసులు చంద్రబాబు ఇంటి లోనికి అనుమతించలేదు. దీంతో పోలీసులు వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే పోలీస్ జీపు ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు.
మరోవైపు విజయవాడ వద్ద కృష్ణానదిలో వరద ప్రవాహం గంటగంటకూ పెరుగుతూ ఉండటంతో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ నివాసం మెట్ల వరకూ వరద నీరు చేరింది. వరద ఉద్ధృతి ఇదే విధంగా కొనసాగితే, చంద్రబాబు ఇంట్లోకి సైతం నీరు వచ్చే ప్రమాదం ఉందని అధికారులు అంటున్నారు. ఈ ప్రాంతాన్ని పరిశీలించిన గుంటూరు కలెక్టర్, రెవెన్యూ అధికారులతో చర్చించారు. ప్రస్తుతం వరద 15 అడుగుల ఎత్తు వరకూ ఉండగా, 16.5 అడుగులకు నీరు పెరిగితే, ఇంట్లోకి నీరు వస్తుందని అధికారులు తెలిపారు. విజయవాడ పరిధిలోని బాలాజీనగర్, భూపేష్ గుప్తా నగర్, కృష్ణలంక ప్రాంతాల్లో ఇప్పటికే వరద నీరు చేరింది. యనమలకుదురు వద్ద ఇళ్లు, పంట పొలాల్లోకి నీరు చేరడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కరకట్టకు దగ్గరలో ఉన్న అరటి తోటలను వరద ముంచెత్తింది.