అర్ధ‌రాత్రి భూకంపం...వ‌ణికిపోయిన తెలుగు రాష్ట్రాలు

April 03, 2020

అర్ధరాత్రి దాటిన త‌ర్వాత‌...ప్ర‌జ‌లంతా ఘాడ నిద్ర‌లో ఉన్న స‌మ‌యంలో సంభ‌వించిన భూకంపం...తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌ను వ‌ణికించింది. ఇటు ఆంధ్రప్రదేశ్‌, అటు తెలంగాణ రాష్ట్రాలోని పలు ప్రాంతాల్లో చోటు చేసుకున్న‌ భూప్రకంపనలు జ‌నాల‌ను ఆందోళ‌న‌కు గురి చేశాయి. కృష్ణా, గుంటూరు, కరీంనగర్‌, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో స్వల్పంగా భూమి కంపించింది. ఇంట్లోని వస్తువులు, వంటపాత్రలు, మంచాలు ఒక్కసారిగా కదలడంతో ప్రజలు భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. 

గ్రామ‌స్థులు మీడియాతో పేర్కొన్న స‌మాచారం ప్ర‌కారం, ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ, తిమ్మనేనిపాలెం, బసవాపురం, పాతర్లపాడు గ్రామాలలో  అర్ధరాత్రి దాటాక భూమి స్వల్పంగా కంపించింది. 2.40 గంటలకు 6 సెకన్లపాటు భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కరీంనగర్‌లో అర్ధరాత్రి 2:40 గంటలకు స్వల్పంగా భూమి కంపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

హుజుర్‌నగర్‌, కోదాడ నియోజకవర్గల్లోనూ భూప్రకంపనలు సంభవించాయి. అర్ధరాత్రి 2:37 గంటలకు పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. మేళ్ల చెరువుతో పాటు పలు మండలాల్లో 12 సెకన్ల పాటు భూమి కంపించింది. నడిగూడెం మండలం తెల్లబల్లిలో తెల్లవారుజామున 2 సెకన్ల పాటు భూప్రకంపనలు చోటు చేసుకున్నట్లు స్థానికులు చెప్పారు. ఈ ఘ‌ట‌న గురించి ఖమ్మం జిల్లా పాతర్లపాడు, నాగులవంచ గ్రామ‌స్తులు ప‌లువురు మీడియాతో మాట్లాడుతూ, సరిగ్గా  ఐదు ఏదేళ్ల కిందట గణతంత్ర దినోత్సవం రోజు త‌మ‌ గ్రామాలలో భూప్రకంపనలు వచ్చినట్లు గ్రామస్థులు చెబుతున్నారు.
కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట, నందిగామ తదితర ప్రాంతాల్లో భూమి కంపించింది. జగ్గయ్యపేటలో అర్ధరాత్రి 2:50 గంటలకు 5 నుంచి 8 సెకన్ల పాటు, నందిగామలో అర్ధరాత్రి 2:40 గంటలకు 10 సెకన్ల పాటు కంపించింది. గుంటూరు జిల్లాలోని అచ్చంపేట, బెల్లంకొండ పరిసరాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి.