జ‌గ‌న్ వ‌ద్ద‌కు వైసీపీ నేత‌ల పంచాయితీ

May 25, 2020

ఏపీ సీఎం జగ‌న్మోహ‌న్‌రెడ్డి కొద్ది రోజులుగా ఇత‌ర పార్టీల‌కు చెందిన నేత‌ల‌ను త‌మ పార్టీలో చేర్చుకునే విష‌యంలో కాస్త త‌టాప‌టాయించారు. ఇక కొద్ది రోజులుగా జ‌గ‌న్ గేట్లు ఎత్తేస్తు వస్తున్నారు. ఈ క్ర‌మంలోనే టీడీపీ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన ఓడిన నేత‌లు ఒక్కొక్క‌రిగా వైసీపీలోకి జంప్ చేసేస్తున్నారు. ఇప్ప‌టికే అన‌కాప‌ల్లి నుంచి టీడీపీ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన అడారి ఆనంద్‌తో పాటు ఆయ‌న సోద‌రి య‌ల‌మంచిలి మాజీ మునిసిప‌ల్ చైర్మ‌న్ పిల్లా ర‌మాదేవి సైతం వైసీపీలో చేరిపోయారు.
ఇక రామ‌చంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు టీడీపీకి గుడ్ బై చెప్పేసి ఈ నెల 18న వైసీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. ఇక తూర్పు గోదావ‌రి జిల్లాకే చెందిన ప్ర‌త్తిపాడు టీడీపీ అభ్య‌ర్థి వ‌రుపుల రాజా సైతం టీడీపీని వీడారు. ఆయ‌న కూడా త్వ‌ర‌లోనే జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టు చాలానే ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది.
ఇదిలా ఉంటే టీడీపీ నుంచి వ‌స్తోన్న ఈ నేత‌ల‌తో వైసీపీ నేత‌ల‌కు పంచాయితీ పోరు త‌ప్పేలా లేదు. ముఖ్యంగా తోట త్రిమూర్తులు వైసీపీ ఎంట్రీని ఆ పార్టీకే చెందిన ఓ మంత్రితో పాటు ఓ ఎమ్మెల్యే సైతం తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. చివ‌ర‌కు సీఎం జగన్‌ వద్దకు ఈ  పంచాయితీ చేరింది. తోట త్రిమూర్తులు రాకను మంత్రి పిల్లి సుభాష్‌, రామ‌చంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ‌ వర్గం వ్యతిరేకిస్తోంది.
రామచంద్రాపురంలో వేర్వేరు వర్గాలుగా పిల్లి సుభాష్‌, వేణు అనుచరులు ఉన్నారు. త్రిమూర్తుల రాకను ఇరు వర్గాలు ఉమ్మడిగా వ్యతిరేకిస్తున్నాయి. ఇక ఈ నియోజ‌క‌వ‌ర్గంలో పిల్లి, తోట వ‌ర్గాల మ‌ధ్య కొన్ని ద‌శాబ్దాలుగా వైరం న‌డుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఈ ఎన్నిక‌ల్లో తోట‌పై గెలిచిన వేణు వ‌ర్గం సైతం తోట ఎంట్రీని వ్య‌తిరేకిస్తోంది.
మ‌రోవైపు తోట వియ్యంకుడు సామినేని ఉద‌య‌భాను కృష్ణా జిల్లా జ‌గ్గ‌య్య‌పేట వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయ‌న రాయ‌భారంతోనే తోట వైసీపీలోకి వెళుతున్నారు. ఇక తోట త్రిమూర్తుల రాకకు వ్యతిరేకంగా మీటింగ్‌ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. పరిస్థితి గమనించి వైసీపీ అధిష్టానం దిద్దుబాటు చర్యలకు సిద్ధమైంది. చెల్లుబోయిన వేణు, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, తోట త్రిమూర్తులుతో జగన్ విడివిడిగా మాట్లాడనున్నారు.