చరిత్రలో మొదటిసారి - బెంగాల్లో ఈసీ విశ్వరూపం

May 28, 2020

ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్ లో బీజేపీ, అధికార తృణమూల్ కాంగ్రెస్ మధ్య జరుగుతున్న హింసాత్మక ఘటనలు పెరిగిపోతుండటం వల్ల ఎన్నడూ లేనట్లు ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎల్లుండి ముగియాల్సిన ఎన్నికల ప్రచారం బెంగాల్ లో  రేపటితో ముగించాలని పార్టీలను ఆదేశించింది. బెంగాల్ లో ప్రచారానికి స్వస్తి చెప్పాలంటూ అన్ని రాజకీయపక్షాలను ఆదేశించడంలో చరిత్రలోనే అరుదైన ఘటన. ఈ మేరకు మొదటిసారిగా 324 అధికరణ చట్టాన్ని రాష్ట్రంలో ఈసీ ప్రయోగించింది.

ఈ చట్టం ఏం చెబుతుందంటే... ఎన్నికల సంబంధిత నిబంధనలు ఉల్లంఘనకు గురయినపుడు, దుష్ప్రవర్తనను, అవాంఛనీయ ఘటనలను నివారించడానికి 324 నిబంధన ప్రకారం... ఎన్నికల సంఘం తన విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవచ్చు అని ఈ అధికరణ చెబుతోంది. ఎన్నికల ప్రచారం కొనసాగిన కొద్దీ హింస చెలరేగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈసీ ఈ చట్టం ప్రయోగించింది.

 దీంతో అన్ని పార్టీలు ఒక రోజు ప్రచారం చేసే అవకాశాన్ని కోల్పోయాయి. కోల్ కతాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఎన్నికల సంఘం ఈ అనూహ్య నిర్ణయం తీసుకుంది.  అమిత్ షా ర్యాలీలో దాడులు, బీజేపీ ప్రతినిధుల నిర్బంధం, అరెస్టులతో బెంగాల్ అట్టుడికిపోతోంది. గతంలో ఇక్కడ రెండు ఎంపీ సీట్లు దక్కించుకున్న బీజేపీ ఈసారి 10 సీట్లపై కన్నేసింది. బెంగాల్ లో 42 సీట్లున్నాయి. అయితే, బీజేపీని ఆ రెండు సీట్లకే పరిమితం చేయాలని మమతా బెనర్జీ కంకణం కట్టుకుంది.

ఇదిలా ఉండగా దీనిపై చంద్రబాబు స్పందించారు. పశ్చిమ బెంగాల్‌లో అసలు బలం లేని బీజేపీ, సీనియర్ మహిళా నేత లాంటి మమతా బెనర్జీ గారిపైకి రాక్షసుల్లా విధ్వంసం సృష్టించి, అక్కడ ప్రభుత్వానికి చెడ్డ పేరు కల్పించి రాజకీయ పబ్బం గడుపుకుందాం అనే వికృత మోదీ-షాల పాచిక పారదని, అల్లర్లు సృష్టించింది అమిత్ షా మనుసులే అని, గతంలో గుజరాత్ లో కూడా ఇలాగే చేశారని చంద్రబాబు ఆరోపించారు.