ఈసీపై జగన్ కి ఎంత కోపమొచ్చిందంటే

June 06, 2020

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్ని కరోనా వైరస్ విస్తరిస్తున్న వేళ.. ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆరువారాల పాటు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సంచలన నిర్ణయంపై సీఎం జగన్ ఎలా ఉన్నారన్న విషయం తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్పష్టమైంది.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కమిషనర్ తన విచక్షణ కోల్పోయి మాట్లాడారని.. టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఆయన అపాయింట్ అయ్యారని చెప్పిన జగన్.. ఎవరో ఏదో ఆర్డర్లు రాసి పంపిస్తే చదివి వినిపిస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు తాము నియమించలేదని.. ఎన్నికల కమిషన్ కు కుల.. మత.. ప్రాంతం అనే స్వార్థాలు ఉండకూడదని.. బాబు తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఎన్నికల కమిషనర్ పదవిలోకి తీసుకున్నారని చెప్పారు. విచక్షణాధికారం పేరుతో ఏకపక్షంగా స్థానిక ఎన్నికల్ని వాయిదా వేశారన్నారు.
కలెక్టర్లు.. ఎస్పీలను ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా ఎలా తప్పిస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో పది రోజుల్లో స్థానిక ఎన్నికల్ని పూర్తి చేయాల్సి ఉందని.. ప్రజల చేత ఎన్నికైన సీఎం కంటే కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు ఎక్కువ అధికారాలు ఉంటాయా? అంటూ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు.రాష్ట్రాన్ని కూడా ఎన్నికల కమిషనరే పాలించొచ్చు కదా? అని తీవ్రస్థాయిలో జగన్ ఆగ్రహం వ్యక్తం చేయటం గమనార్హం.
స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై సీఎస్.. వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శులతో చర్చించలేదన్న జగన్.. ఎన్నికల వాయిదాపై జారీ చేసిన ఉత్తర్వుల్లో మాత్రం వారిని సంప్రదించినట్లుగా పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జోరు చూసిన టీడీపీకి భయం పట్టుకుందన్నారు. 10,243 చోట్ల ఎంపీటీసీ.. జడ్పీటీసీ  ఎన్నికలు జరుగుతుంటే.. 43 చోట్ల మాత్రమే చెదురుముదురు ఘటనలు జరిగినట్లుగా చెప్పారు.
2794 వార్డుల్లో 15185 నామినేషన్లు దాఖలు చేస్తే.. 14 చోట్ల మాత్రమే చెదురుముదురు ఘటనలు జరిగినట్లుగా చెప్పిన జగన్.. ఏ స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా ఇంత తక్కువగా ఘటనలు చోటు చేసుకున్నాయా? అని ప్రశ్నించారు. పోలీసులు ఎక్కడా ప్రేక్షక పాత్ర పోషించలేదని.. నిబద్ధతతో వ్యవహరించినట్లుగా పేర్కొన్నారు. వ్యవస్థల్ని నీరుగార్చే కార్యక్రమానికి విపక్ష నేత చంద్రబాబు చేస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు ఏపీ ప్రజలు చింతించాల్సిన అవసరం ఉందన్న జగన్.. స్థానిక సంస్థలకు జరుగుతున్న ఎన్నికల వాయిదాపై తనకున్న ఆగ్రహాన్ని మొహమాటం లేకుండా బయటకు వ్యక్తం చేశారని చెప్పాలి.

కొసమెరుపు : ఎస్పీని తప్పిస్తే జగన్ ఇంత సీరియస్ అవుతున్నారు. ఆయనపై కూడా కులముద్ర వేస్తున్నారు. మరి సాధారణ ఎన్నికల సమయంలో ఏకంగా ప్రధాన కార్యదర్శిని, ఇంటెలిజిన్స్ చీఫ్ ను తప్పిస్తే జగన్ అపుడు ముసిముసినవ్వులు నవ్వారు. గతం మరిచిపోతే ఎలా ముఖ్యమంత్రి గారు!