మీరు కోరిన‌ట్లు చేయ‌లేం.. ఈసీ తెగింపు !

July 08, 2020

22 పార్టీల‌కు చెందిన ప్ర‌తినిధులు కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ ముందు ఉంచిన డిమాండ్ పై తాజాగా స్పందించింది. ఓట్ల లెక్కింపున‌కు ముందుగా ఐదు ఈవీఎంలు.. వీవీ ప్యాట్ స్లిప్పుల‌ను లెక్కించాల‌ని.. అందులో కానీ తేడా వ‌స్తే నియోజ‌క‌వ‌ర్గం మొత్తం వీవీ ప్యాట్ల‌ను లెక్కించాల‌న్న డిమాండ్ ను తోసిపుచ్చింది. రేపు (గురువారం) చేప‌ట్టే ఓట్ల లెక్కింపులో మొత్తం ఈవీఎంలు లెక్కించిన త‌ర్వాత‌.. ఐదింటిని మాత్రం ఆపుతారు. చివ‌ర్లో ఆ ఐదింటిని ఒక‌టి త‌ర్వాత మ‌రొక‌టి వీవీప్యాట్ల స్లిప్పుల్ని లెక్కిస్తారు. అందులో తేడా వ‌స్తే.. వీవీ ప్యాట్లలో న‌మోదైన స్లిప్పుల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని విజేత‌ను ప్ర‌క‌టిస్తారు.
ఈ విధానాన్ని బాబుతో స‌హా 22 పార్టీల అధినేత‌లు వ్య‌తిరేకిస్తున్నారు. ఓట్ల లెక్కింపును ప్రారంభించిన వెంట‌నే తొలుత ఐదు ఈవీఎంలు.. వీవీప్యాట్ల‌లో న‌మోదైన స్లిప్పుల‌ను లెక్కించాల‌ని.. ఒక‌వేళ ఈవీఎంలు.. వీవీ ప్యాట్ల లెక్క కానీ తేల‌ని ప‌క్షంలో.. నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని అన్ని ఈవీఎంలు.. వీవీ ప్యాట్ స్లిప్పుల్ని లెక్క వేయాలంటూ డిమాండ్ చేశారు.
ఈ అంశంపై తాజాగా ఈసీ స్పందించింది. విప‌క్షాల డిమాండ్ ను తాము ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేమ‌ని తేల్చి చెప్పింది. లెక్కింపు విధానంలో ఎలా మార్పుల‌ను తాము చేయ‌ట్లేద‌ని స్ప‌ష్టం చేసింది. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం క‌లిసిన 22 పార్టీల ప్ర‌తినిధులు ఈసీ దృష్టికి ఈ ఇష్యూను తీసుకెళ్లాయి. దీనిపై బుధ‌వారం నిర్ణ‌యం తీసుకుంటాన‌ని చెప్పిన ఈసీ.. తాజాగా విప‌క్షాల డిమాండ్ కు నో చెబుతూ తేల్చేశారు. ఈ నిర్ణ‌యాన్ని విపక్షాలు విమ‌ర్శ‌లు వ్య‌క్తం చేస్తున్నాయి.