మోడీపై ఈసీ సంచలన నిర్ణయం

July 11, 2020

ఎన్నికల వేళ బయోపిక్ ల హవా కొనసాగుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ రామ్ గోపాల్ వర్మ సంచలనం సృష్టించడంతో దానిని ఆంధ్రప్రదేశ్ లో నిలిపివేయాలంటూ పెద్ద ఎత్తున పిటిషన్స్ దాఖలు కావడం, ఆ తర్వాత చిత్రాన్ని నిలిపివేస్తూ ఎలక్షన్ కమీషన్ నిర్ణయం తీసుకోవడం జరిగిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలోనే మోడీ జీవిత కథ ఆధారంగా నిర్మించిన మోడీ బయోపిక్ విడుదలకు ఆదేశాలు ఇవ్వటం ఏమిటని ప్రశ్నిస్తూ ఈసీపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. కేంద్ర సర్వీసుల్లో కీలక స్థానాల్లో పని చేసిన అరవైకి పైగా మాజీ ప్రధాన అధికారులు ఈ పిటిషన్ దాఖలు చేయడం విశేషం.

కీలకమైన ఎన్నికల వేళ.. ప్రధాని మోడీ బయోపిక్ రిలీజ్ కు ఎలా అనుమతి ఇస్తారంటూ వారు ఆ పిటిషన్ లో ప్రశ్నించారు. మరోవైపు ఇప్పటికే విపక్షాలు కూడా ఇదే ప్రశ్నను పలుసార్లు సంధించాయి. దీంతో మోడీ బయోపిక్ విడుదలకు అనుమతి ఇస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న ఈ వేళ.. కేంద్ర ఎన్నికల సంఘం సలచంన నిర్ణయాన్ని తీసుకుంది. 2019 లోక్ సభ ఎన్నికలు ముగిసే వరకూ పీఎం నరేంద్ర మోడీతో సహా ఎలాంటి బయోపిక్ లు విడుదల చేయరాదంటూ ఆదేశాలు జారీ చేసింది. బాలీవుడ్ నటుడు వివేక్ ఓబరాయ్ మోడీగా నటించిన మోడీ బయోపిక్ నమో విడుదలపై దాఖలైన వాజ్యంపై స్పందించిన అత్యుత్తమ న్యాయస్థానం.. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోమని పేర్కొంది. ఈ విషయంపై తుది నిర్ణయం ఈసీదేనని స్పష్టం చేసింది.

ఈ పరిస్థితుల్లో ఊహించని రీతిలో స్పందించిన ఈసీ.. మోడీ బయోపిక్ తో పాటు, మరే ఇతర బయోపిక్ లను లోక్ సభ ఎన్నికలు ముగిసే వరకూ అనుమతించకూడదన్న నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ ఎన్నికల వేళలో మోడీ బయోపిక్ రిలీజ్ అయితే.. భారీ ప్రయోజనం చేకూరుతుందని ఆశించిన వారికి.. ఈసీ తీసుకున్న తాజా నిర్ణయం షాకింగ్ గా మారిందని చెప్పక తప్పదు. ఈసీ తాజా నిర్ణయం మోడీ పరివారానికి దిమ్మ తిరిగే షాకిస్తుందనటంలో సందేహం లేదు. ఇంతకాలం ఈసీ వంగిపోయి పని చేస్తుందంటూ విరుచుకుపడినోళ్లు, విమర్శలు చేస్తున్న వారు.. తాజా నిర్ణయంతో కామ్ అయిపోయారు.