కరోనా టెస్టులకు ఈసీఐఎల్ డివైజ్

August 07, 2020

ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్రాణాంతక వైరస్ కరోనాకు సంబంధించిన చర్చే. ఈ వైరస్ సోకిన వారిని గుర్తించడం, పాజిటివ్ అని తేలితో చికిత్స మొదలుపెట్టడం, అసలు ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చేపట్టాల్సిన చర్యలు, అందుకు అటు వైద్య బృందాలతో పాటు ఇటు అధికారిక బృందాలు కూడా అహోరాత్రులు శ్రమిస్తున్న తీరుపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇలాంటి కీలక తరుణంలో సదరు వైద్య సిబ్బందికి ఎంతగానో ఉపయోగపడే ఓ కొత్త పరికరం త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ పరికరం ఎక్కడో విదేశాల్లో తయారు కానున్నది కాదు. మేడిన్ ఇండియా పరికరమే...నిజమా? అంటే.. కేంద్ర ప్రభుత్వ రంగంలోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐఎల్)నుంచి వెలువడుతున్న సమాచారం చూస్తే... అతి తక్కువ వ్యవధిలోనే ఈ పరికరం మనకు అందుబాటులోకి రానుంది. అంతేానా.. ఈసీఐఎల్ కు చెందిన హైదరాబాద్ యూనిట్ లోనే ఈ పరికరం తయారీ మొదలు కానుందట. అమితాసక్తి రేకెత్తిస్తున్న ఈ విషయం గురించిన పూర్తి వివరాల్లోకి వెళ్లిపోదాం పదండి.

గతంలో ఈసీఐఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా, ప్రస్తుతం అణుశక్తి శాఖకు సలహాదారుగా పనిచేస్తున్న పొట్లూరి సుధాకర్, ఇటీవల కరోనా వైరస్ పై జరిగిన ఓ ఉన్నత స్థాయి సమీక్షలో కరోనా చికిత్సలకు ఉపయోగపడే ఓ కొత్త పరికరానికి, సాఫ్ట్వేర్ కు సంబంధిచిన ప్రతిపాదనలను ప్రస్తావించటంతో ఈ ప్రక్రియ మొదలయ్యిందట.

ప్రస్తుతం కోవిడ్-19 చికిత్స కోసం వినియోగిస్తున్న ఆక్సీ మీటర్, థర్మల్ స్కానర్లు చేస్తున్న పనులే ఈ కొత్త పరికరం చేయనున్నా.. వాటికంటే మెరుగైన ఫలితాలను ఇవ్వనుందట. అంతేకాకుండా దీనిని చేతికి వాచీ మాదిరిగా పెట్టుకోవచ్చట. ఎలాంటి రక్త నమూనాల అవసరం లేకుండానే ఈ పరికరం.. కరోనా రోగి ఆరోగ్యానికి సంబంధించిన కీలక వివరాలను తెలియచేస్తుంది. రోగి శరీర ఉష్టోగ్రత, రక్తం లోని ఆక్సిజన్ శాతం, ఊపిరి రేటు, పల్స్ రేటు లాంటి అనేక వివరాలను ఎప్పడికప్పుడు రిమోట్ వ్యవస్థ ద్వారా వైద్యులకు తెలియచేయటానికి అవసరమైన సాంకేతికను కూడా ఈ పరికరంలో పొందుపర్చారట. కరోనా వైరస్ చికిత్సల్లో నిమగ్నమైన వైద్య సిబ్బందికి వైరస్ నుంచి ముప్పును తప్పించటంలో కూడా ఈ పరికరం ఎంతో ఉపయోగపడుతుంది.

అంతేకాదండోయ్... ఈ పరికరం తో పాటుగా ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్వేరుతో వైద్యులు ఎక్కడినుంచి అయినా రోగి ఆరోగ్యానికి సంబందించిన వివరాలను తమ మొబైల్స్లో ఎప్పటి కప్పుడు చూసుకోవచ్చట. అధికార యంత్రాంగం కూడా రోగికి సంబందించిన వివరాలను వాళ్ళ మొబైలేలోను లేదా లాప్టాప్లోను లేదా
డెస్క్టాప్లోను చూసుకోవచ్చునంటా.
అంతేకాకుండా కృత్రిమ మేధస్సు సాంకేతికను వినియగించుకొంటున్న ఈ సాఫ్ట్వేర్ ఏయే ప్రాంతాల్లో ఈ కరోనా వ్యాధి ఎట్లా వ్యాపిస్తోందన్న వివరాలను అధికారులకు ఎప్పటికప్పుడు తెలియచేస్తుందట.

మొత్తంగా చెప్పాలంటే... ఈ పరికరం వైద్య సిబ్బందికి, అధికార యంత్రాంగానికి ఎంతగానో ఉపయోగపడుతుందనే ప్రచారం సాగుతోంది.

సరే... ఇదంతా బాగానే ఉన్నా.. కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ పరికరం ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్న విషయంపై... ఆసక్తికర వివరాలు వెలుగులోనికి వచ్చాయి..

అన్నీ కుదిరితే కొద్దీ రోజుల వ్యవధిలోనే ఈ పరికరం ఉత్పత్తిని హైదరాబాద్ లోని ఈసీఐఎల్ యూనిట్ లోనే తయారుచేస్తారట.

ప్రస్తుతం ఈ పరికరం తొలి దశ నమూనాలు సిద్ధమయ్యాయని, వాటి పని తీరుపై ముమ్మరంగా పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలియవచ్చింది.

ఈ పరీక్షల్లో ఈ పరికరం పనితీరును అంచనా వేసి... సదరు నివేదికలను ప్రభుత్వానికి అందజేసి... ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే వెనువెంటనే ఉత్పత్తిని ప్రారంభిస్తారని తెలియవస్తోంది.

ఈ పరికరం అందుబాటులోకి వస్తే... కరోనా చికిత్సను మెరుగుపరచడమే కాకుండా... వైరస్ వ్యాప్తిపై వైద్యులు, అధికార యంత్రాంగానికి ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందని చెప్పక తప్పదు.

 

RELATED ARTICLES

  • No related artciles found