బాద్ షాకు భారీ షాక్.. ఆస్తులు జఫ్తు?

August 05, 2020

బాలీవుడ్ బాద్షాగా పేరున్న షారూక్ ఖాన్ సమస్యల్లో కూరుకుపోతున్నారు. ఆయన వేలు పెట్టిన ప్రతిచోటా కాలిపోతున్న పరిస్థితి. సినిమాలు చూస్తే ఫ్లాపుల మీద ఫ్లాపులు.. చేస్తున్నవ్యాపారాలు కలిసి రాని పరిస్థితి. ఈ సమస్యలు ఇలా ఉంటే.. ఇప్పుడు ఆయనకు  కొత్త కేసులు చుట్టుకుంటున్నాయి. తాజాగా ఈడీ ఆయన ఆస్తుల్ని జఫ్తు చేసిన వైనం బయటకు వచ్చి సంచలనంగా మారింది.
ఆ మధ్యన షారూక్ చేసిన జీరో సినిమా బాక్సాఫీసు దగ్గర బోల్తా పడటమే కాదు.. ఆయన నిజంగానే జీరో అయిపోయారన్న వ్యంగ్య వ్యాఖ్యలు వినిపించాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఆయన యజమానిగా వ్యవహరించిన కోల్ కతా నైట్ రైడర్ కు సంబంధించిన వ్యవహారాల్లో అవకతవకలు జరిగినట్లుగా ఈడీ నిర్థారించింది. రోజ్ వ్యాలీ పోంజి కుంభకోణంలో షారూక్ కు చెందిన నైట్ రైడర్స్ కు లింకు ఉందని ఈడీ తేల్చటమే కాదు.. రూ.70 కోట్ల మొత్తాన్ని మనీ లాండరింగ్ సెక్షన్ కింద సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది.
కోల్ కతా నైట్ రైడర్స్ స్పోర్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ తో పాటు మల్టీపుల్ రిసార్టు ప్రైవేటు లిమిటెడ్.. కోల్ కతా సెయింట్ జేవియర్స్ కాలేజీలకు చెందిన ఖాతాలను సీజ్ చేసినట్లు చెబుతున్నారు. అయితే.. తాజా జఫ్తులకు షారూక్ కు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ ఈడీ అటాచ్ మెంట్ తో ఎలాంటి లింకు లేదని చెబుతున్నారు. అయితే.. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉందంటున్నారు.