‘ఈనాడు’కు పట్టిన 20 ఏళ్ల గ్రహణం వీడింది

August 08, 2020

‘ఈనాడు’ పత్రికలో ఏ పేజీ చూసినా ప్రకటనలు కనిపిస్తాయి. అన్ని రకాల యాడ్స్ ఉంటాయి. కానీ ఒక్క సినిమా పేజీలో మాత్రం యాడ్స్ కనిపించవు. ఆ పేజీలో ‘ఉషా కిరణ్ మూవీస్’ వాళ్లు ప్రొడ్యూస్ చేసిన సినిమా ఏదైనా ఉంటేనో.. లేదంటే ఈటీవీకి సంబంధించిన సీిరియల్స్ గురించో యాడ్స్ ఉంటాయి తప్ప.. ఆంధ్రజ్యోతిలో, సాక్షిలో కనిపించే సినిమాల యాడ్స్ మాత్రం ఇందులో ఉండవు. దీనికి కారణం ఏంటి అన్నది పాఠకులకు అంతు బట్టదు. అలాంటిది ఉన్నట్లుండి ఈ ఆదివారం ‘ఈనాడు’ సినిమా పేజీలో ‘అల వైకుంఠపురములో’ సినిమాకు సంబంధించిన యాడ్ కనిపించింది. అది చూసి అందరూ షాకైపోయారు. ‘ఈనాడు’లో ఇదేం చోద్యం అని. మరి ఇన్నేళ్లుగా లేనిది ఇప్పుడేమైంది? ఇంతకుముందు యాడ్స్ ఎందుకు లేవు.. ఇప్పుడు ఈ ఒక్క యాడ్ ఎందుకు కనిపించింది? మున్ముందు కూడా ఇలాంటి ప్రకటనలు చూస్తామా? అన్న ప్రశ్నలు పాఠకుల్లో ఉన్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే 20 ఏళ్లు వెనక్కి వెళ్లేవి.

ఒకప్పుడు మిగతా పత్రికల్లో మాదిరే ‘ఈనాడు’లో కూడా సినిమా యాడ్స్ వచ్చేవి. ఐతే టాలీవుడ్ పెద్ద దాసరి నారాయణరావుకు, రామోజీ రావుకు విభేదాలు తలెత్తడం.. ఆయన ‘ఉదయం’ పత్రిక పెట్టడం.. రెండు పత్రికల మధ్య పోటా పోటీ నడవడం రెండు దశాబ్దాల కిందట పత్రికలు ఫాలో అయిన వాళ్లకు బాగానే తెలుసు. ఆ సమయంలోనే ‘ఈనాడు’కు, టాలీవుడ్‌కు మధ్య డిష్యుం డిష్యుం నడిచింది. ‘ఈనాడు’లో యాడ్ టారిఫ్స్ ఎక్కువుండటంపై పరిశ్రమ నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అదే సమయంలో స్పాట్ పేమెంట్ ఇవ్వాల్సిందే అని.. మిగతా పత్రికలకు ఇచ్చినట్లు లేటుగా డబ్బులిస్తే కుదరదని ‘ఈనాడు’ వాళ్లు హుకుం జారీ చేశారట. దీంతో దాసరి నేతృత్వంలో ఇండస్ట్రీ జనాలు ‘ఈనాడు’కు యాడ్స్ ఇవ్వొద్దని తీర్మానం చేశారు. రామోజీ రావు పంతం ఎలాంటిదో తెలిసిందే. రాయబారాలేమీ నడపలేదు. తమ పద్ధతుల విషయంలో అంతే పట్టింపుతో ఉన్నారు. అలా ‘ఈనాడు’కు సినిమా యాడ్స్ ఆగిపోయాయి. 

ఆ దశలో ఈటీవీలో సైతం ఏ సినిమా యాడ్స్ వచ్చేవి కావు. వాళ్లకు ఏ సినిమా శాటిలైట్ హక్కులూ ఇచ్చేవాళ్లు కూడా కాదు. ఇలా ఓ దశాబ్దం పాటు ప్రతిష్టంభన కొనసాగింది. తర్వాత రామోజీ గ్రూప్ కొంత తగ్గింది. ‘ఈటీవీ’లోకి ప్రకటనలు వచ్చాయి. సినిమాల శాటిలైట్ హక్కులు కూడా కొనడం మొదలు పెట్టారు. ఈ మధ్య ‘ఈనాడు’ సినిమా పేజీకి ప్రకటనలు తీసుకునే విషయంలోనూ సంప్రదింపులు మొదలయ్యాయి. పేమెంట్లు, డిస్కౌంట్ల విషయంలో కొంచెం నిబంధనలు సడలించారు. ఇండస్ట్రీ నుంచి కూడా సానుకూల స్పందన రావడంతో ప్రతిష్టంభన తొలగి.. 20 ఏళ్ల విరామం తర్వాత ‘ఈనాడు’ సినిమా పేజీలో సినిమా ప్రకటన వచ్చింది. కాబట్టి ఇక ముందూ అందులో సినిమా ప్రకటనలు కొనసాగే అవకాశముంది.