సిల్లీగా వేసిన ట్వీట్ టో సీరియస్ గా లక్ష కోట్లు పోయాయి

June 04, 2020

ఒకే ఒక్క ట్వీట్. దాని విలువ ఎంతో తెలుసా? ఏకంగా రూ.లక్ష కోట్లు. విన్నంతనే నిజం కాదనిపించే ఈ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారటమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా హాట్ న్యూస్ గా మారింది. ఒక ప్రముఖుడి అనవసర ట్వీట్ సదరు కంపెనీ విలువ రూ.లక్ష కోట్ల మేర పడిపోయేలా చేసింది. ఇంతకీ ఆ ప్రముఖుడు ఎవరు? ఆ కంపెనీ ఏమిటి? అన్న విషయంలోకి వెళితే..
ఎలాన్ మాస్క్ అన్నంతనే గుర్తుకు రాకపోవచ్చు. భవిష్యత్తులో చంద్రుడి మీదా.. అంగారక గ్రహం మీదకు మనుషుల్ని తీసుకెళ్లే మహా ప్రాజెక్టులతో పాటు.. బోలెడన్ని వ్యాపారాలు చేసే టెస్లా వ్యవస్థాపకుడిగా అతడికున్న పేరు ప్రఖ్యాతులు ఎక్కువే. అయితే.. ఇతగాడికో దరిద్రపుగొట్టు అలవాటు ఉంది. అనవసరంగా విషయాల్ని తనకు తానుగా కెలుక్కోవటం.. కంపెనీ మీదకు తీసుకురావటం.. షేరు విలువ భారీగా ప్రభావితం అయ్యేలా చేయటం ఆయనకో అలవాటు.
తాజాగా ఆయన చేసిన ఒక ట్వీట్ టెస్లాకు ఏకంగా రూ.లక్ష కోట్ల మేర నష్టం వాటిల్లేలా చేసిందని చెబుతున్నారు. టెస్లా మార్కెట్ విలువ 141 బిలియన్ డాలర్లు. తాజాగా ఎలాన్ తన ఆస్తుల్ని అమ్మకాలకు పెడుతున్నట్లుగా పేర్కొన్నాడు. దీనికి ఒక ఫాలోయర్ డబ్బులు అవసరమై ఇలా ఆస్తుల్ని అమ్మకాలకు పెడుతున్నారా? లేక ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు నిరసనగా ఇలా చేస్తున్నారా? అని ప్రశ్నించారు.
దీనిపై మాస్క్ స్పందిస్తూ.. డబ్బు అక్కర్లేదు. అంగారకుడికి.. భూమికి నన్ను నేను అంకితం చేసుకుంటున్నాను.. ఆస్తులు కలిగి ఉండటం భారమే తప్పించి మరొకటి కాదని పేర్కొన్నారు. ఇతగాడి ట్వీట్ తో టెస్లా మార్కెట్ విలువ భారీగా పడిపోయింది. షేర్ విలువ పతనమైంది. దీంతో.. 141 బిలియన్ డాలర్లు ఉన్న కంపెనీ మార్కెట్ వాల్యూ కాస్తా 127 బిలియన్ డాలర్లకు పతనమైంది.
గతంలోనూ ఇదే తరహాలో అనవసరమైన విషయానికి స్పందించి కంపెనీకి భారీగా నష్టం వచ్చేలా చేయటంతో పాటు.. ఛైర్మన్ పదవిని పోగొట్టుకున్న ట్రాక్ రికార్డు ఉంది. 2018లో టెస్లా కంపెనీ స్టాక్ మార్కెట్ నుంచి వైదొలుగుతుందని.. ప్రైవేటు యాజమాన్య సంస్థగా మారుతుందని ట్వీట్ చేశాడు. దీంతో.. టెస్లా కంపెనీ షేరు విలువ భారీగా పెరిగింది. అయితే.. ఆ వార్తలో నిజం లేదని యూఎస్ సెక్యురిటీస్ అండ్ ఎక్సైంజ్ కమిషన్ తేల్చటంతో మాస్క్ తన ఛైర్మన్ పదవిని కోల్పోవాల్సి రావటమే కాదు.. భారీగా షేరు విలువ పతనమైంది. తాజాగా మరోసారి అతగాడి ట్వీట్ కు టెస్లా భారీ మూల్యాన్ని చెల్లించాల్సి రావటం గమనార్హం.