పీవీ సింధుతో నాకు పెళ్లి చేయండి... గవర్నమెంటుకు లేఖ

August 13, 2020

అంతర్జాతీయ టోర్నీల్లో సత్తా చాటుతూ దేశానికి గర్వకారణంగా మారిన తెలుగు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుతో తనకు పెళ్లి జరిపించాలంటూ తమిళనాడుకు చెందిన ఓ వృద్ధుడు హడావుడి చేశాడు. తమిళనాడులోని రామనాథపురం జిల్లాకు చెందిన ఆ వృద్ధుడు తనకు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుతో పెళ్లి చేయాలని సాక్షాత్తు జిల్లా కలెక్టర్ నే సాయం కోరాడు. జిల్లా కలెక్టర్ వీరరాఘవరావు ప్రజాదర్బార్ నిర్వహిస్తుండగా, 70 ఏళ్ల మలైసామి అనే వృద్ధుడు కూడా వినతిపత్రంతో హాజరయ్యాడు. ఏదో సాయం కోసం వచ్చాడని అందరూ అనుకున్నారు.. కానీ, ఆయన తీసుకొచ్చిన వినతి పత్రం చూడగానే కలెక్టర్, ఇతర అధికారులు షాకయ్యారు.
తాను 2004లో జన్మించానని, తాను దేవుడి ప్రత్యేక అవతారాన్నని, దుష్టశిక్షణ శిష్ట రక్షణ కోసం అవతరించానని అందులో రాసుకొచ్చిన ఆయన... తనలాంటి కారణజన్ములు సాధారణ యువతులను పెళ్లి చేసుకోరాదని, అందుకే పీవీ సింధు వంటి పేరుప్రతిష్ఠలున్న అమ్మాయిని పెళ్లిచేసుకోవాలని భావిస్తున్నానని తన లేఖలో వివరించాడు. పీవీ సింధును పెళ్లి చేసుకునేందుకు కలెక్టర్ గారు సహకారం అందించాలని, కుదరకపోతే కిడ్నాప్ చేసైనా ఆమెను పెళ్లాడతానని మలైసామి పేర్కొన్నాడు. ఆ లేఖలో తన ఫొటో పక్కనే పీవీ సింధు ఫొటో కూడా అతికించి తీసుకొచ్చాడు.
కాగా... ఈ వినతిపత్రం చూసిన కలెక్టర్ కార్యాలయం సిబ్బంది పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నారట. మలైసామి లేఖపై కలెక్టర్ కార్యాలయం ఎలాంటి చర్యలు తీసుకుందో తెలియదు కానీ, ఈ విషయం మాత్రం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా సందడి చేస్తోంది. తొలుత ఇండియాటుడే వెబ్‌సైట్ దీన్ని ప్రచురించడంతో ఆ తరువాత జాతీయ మీడియా మొత్తం ఎత్తుకుంది. మలైస్వామి ప్రచారం కోసమే ఇలా చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా సింధు పేరు మార్మోగిపోతుండడంతో ఆమె పేరు వాడుకుంటే పబ్లిసిటీ వస్తుందన్న ఉద్దేశంతో ఆయన ఇలా చేసి ఉండొచ్చని చెబుతున్నారు.