సుప్రీంకోర్టును బురిడీ కొట్టించిన ఎన్నికల సంఘం

July 20, 2019

మన దేశంలో పేరుకే స్వతంత్ర సంస్థలు గాని... వాటి పరిపాలకులను ఎంపిక చేసేది ప్రజలు ఎన్నుకున్న ప్రధానులే కాబట్టి స్వతంత్ర సంస్థలు అనేది ఒక భ్రమగా మిగిలిపోతోంది. అయితే, అధికారంలో ఉన్న వారు ఎంత కంట్రోల్ చేసినా తప్పులకు కూడా గతంలో ఒక హద్దు ఉండేది. పాలకులకు కూడా ప్రజలంటే భయం ఉండేది. కానీ నేటి రోజుల్లో అన్ని విలువలు సంపూర్ణంగా పతనం అయ్యాయి. పొరపాట్లు జరిగితే పర్లేదు. ఉద్దేశ పూర్వక తప్పులు, ఎవరికోసమో చేస్తున్నారు. ఈరోజు ఇలాంటి ఓ తప్పును ఎన్నికల సంఘం చేసినట్టు చంద్రబాబు ఒక సంచలన నిజాన్ని బయటపెట్టారు. అది విన్న దేశ ప్రజలు షాక్ తిన్నంత పని అయ్యింది. ముందు ఆ నిజం ఏంటో తెలుసుకుందాం. తర్వాత ఇంకో ప్రధాన మైన విషయం మాట్లాడుకుందాం.

కొన్ని రోజుల క్రితం 23 రాజకీయ పార్టీలు ఒక జట్టుగా ఏర్పడి ఈవీఎం కంటే బ్యాలెట్ పేపరు మంచిదని, దానిని ప్రవేశపెట్టాలి అది కుదరకపోతే వీవీ ప్యాట్లను 50 శాతం లెక్కించాలి అంటూ సుప్రీంకోర్టులో పిటిషను వేశాయి. దీనిపై ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసు ఇచ్చింది. ఈ నోటీసుకు స్పందిస్తూ సమాధానంగా ఎన్నికల సంఘం కోర్టుకు ఓ నివేదిక అందజేసింది. అయితే, అందులో ఎంత ఘోరమైన దారుణానికి పాల్పడిందంటే... కోర్టుకు ఒక పెద్ద అబద్ధం చెప్పింది. బ్యాలెట్ పేపరు పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తే... ఓట్లను లెక్కించడానికి ఒక్కో నియోజకవర్గానికి 6 రోజులు పడుతుందని ఎన్నికల సంఘం పెద్ద అబద్ధం చెప్పింది. అందువల్ల బ్యాలెట్ కంటే ఈవీఎం మంచిది అని ఎన్నికల సంఘం పేర్కొంది. 

వాస్తవం ఏంటంటో... నిజం ఈ దేశ ప్రజలు అందరికీ తెలుసు. బ్యాలెట్ పద్ధతిలో 60 ఏళ్ల పాటు ఈ దేశంలో ఎన్నికలు జరిగాయి. ఏనాడూ 24 గంటలకు మించి ఓట్ల లెక్కింపునకు సమయం పట్టలేదు. కానీ కోర్టును తప్పుదారి పట్టించడానికి ఎన్నికల సంఘం ఈ అబద్ధం చెప్పింది. మరి ఎవరి ప్రయోజనాల కోసం ఈ అబద్ధం చెప్పాలి వచ్చింది? అనేది ఒక ప్రశ్న.

ఇపుడు ఇంకో ప్రధానమైన విషయం మాట్లాడుకుందాం. సరే ఎన్నికల సంఘం కోర్టును బురిడీ కొట్టించడానికి కొందరు ప్రయోజనాల కోసం అలా అబద్ధం చెప్పింది అనుకుందాం. మరి 50 ఏళ్లకు పైబడిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు వాస్తవం ఏంటో తెలియదా? వారు కూడా గతంలో ఓటు వేశారు. గతంలో బ్యాలెట్ ఓట్ల లెక్కింపును చూశారు. వారు ఎందుకు దీనిని పసిగట్టలేదు. ఒక వేళ పసిగట్టి ఉంటే ఈ అబద్ధం చెప్పినందుకు ఎన్నికల సంఘాన్ని ఎందుకు నిలదీయలేదు. ఎందుకు శిక్షించలేదు? లాయర్లు ఏది వాదిస్తే అదేనా.. కోర్టులు ఇలా కళ్లు మూసుకుంటే భవిష్యత్తులో న్యాయస్థానాలను ఇంకా ఎలాంటి ఘోరాలతో బురిడీ కొట్టిస్తారో కదా? అన్నది సామాన్యుడిని భయపెడతున్న ప్రశ్న.