ఏపీ ప్రజలకు మరింత టెన్షన్ పెట్టే వార్త

July 12, 2020

ఈసారి ఎన్నికల ఫలితాలు స్లోగా విడుదల అవుతాయని ప్రధాని ఎన్నికల అధికారి ద్వివేది తెలిపారు. ఏపీలో లోక్ సభతో పాటు, అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన నేపథ్యంలో అక్కడ ఇంకొంచెం ఆలస్యం అవుతాయని తెలుస్తోంది. దీనికి కారణం... వీవీ ప్యాట్ల లో స్లిప్పుల సంఖ్య, ఈవీఎం ఓట్లతో సరిపోవాలి. లేని పక్షంలో దానిని వెల్లడించరు. అందుకే ఈసారి ఆలస్యం అవుతుంది. అంటే ఈవీఎం బటన్ నొక్కితే ఒక్క నిమిషంలో తేలిపోయినా తర్వాత దానికి సంబంధించిన వీవీ ప్యాట్లోని సుమారు 1000 నుంచి 2000 వేలు స్లిప్పులు లెక్కించడానికి సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో కచ్చితంగా ఎన్నికల ఫలితాల వెల్లడి ప్రక్రియలో గందరగోళం ఉంటుంది.

ఇప్పటికే 43 రోజుల భారీ గ్యాప్ వల్ల ఏపీ ప్రజలు ఉత్కంఠతో సతమతం అవుతున్నారు. మే 23, ఉదయం 8 గంటలు ఎపుడు అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వీవీ ప్యాట్ల ప్రక్రియ వారికి మరింత టెన్షన్ పెంచనుంది. ఇదిలా ఉండగా.... చంద్రబాబు వేసిన రివ్యూ పిటిషనుపై సుప్రీంకోర్టు తన పాత తీర్పును మార్చి అధిక సంఖ్యలో వీవీ ప్యాట్లను లెక్కించాలని తీర్పు కనుక వెలువరిస్తే... ఇక మధ్యాహ్నం దాకా ట్రెండ్ ఎలా ఉందో కూడా తెలిసే అవకాశం ఉండదు. పోటీ చేసిన అభ్యర్థులకు హై టెన్షన్ ఉంటుంది. ఏది ఏమయినా... ఈ ఎన్నికల్లో చాలా విచిత్రాలే ఉన్నాయి.