ఎన్నికల నగారా మోగింది.. సునీల్ అరోరా ఏర్పాట్లు

May 29, 2020

దేశ వ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది. 17 వ లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేశారు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునీల్ అరోరా. దీంతో మరో నెల రోజుల వ్యవధిలోనే రాష్ట్ర అసెంబ్లీకి, లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనుండడంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మార్చి 18న ఏపీ, తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 18న తొలి విడత ఎన్నికల గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ అయ్యాక.. మార్చి 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఆ తర్వాత మార్చి 26న నామినేషన్ల పరిశీలన జరిపి.. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 28 వరకు గడువు ఇస్తారు. ఇక మే 23న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువరిస్తారు. 

ఈ సందర్బంగా 17 వ పార్లమెంట్ లో  543 పార్లమెంటు స్థానాల ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్డ్ వివరాలు తెలిపిన సునీల్ అరోరా.. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లను కట్టుదిట్టం చేస్తామని ప్రకటించారు. పరీక్షలు, పండుగలకి సంబంధించిన తేదీలను పరిగణనలోకి తీసుకుని ఎన్నికల షెడ్యూల్ రూపొందించటం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల చీప్ ఎలక్షన్ కమీషనర్ లతో మాట్లాడామని, ఇప్పటికే చాలా రాష్ట్రాలలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించడం జరిగిందని అన్నారు. 1950 నెంబర్ కి దయాల్ చేసి ఓటర్లు తమ తమ ఓటు వివరాలను చెక్ చేసుకోవచ్చని అన్నారు. దేశ వ్యాప్తంగా 90 కోట్ల మంది ఓటర్లు ఉండగా వారి కోసం సుమారు 10లక్షల పోలింగ్ కేంద్రాలు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ఓటర్ కార్డుతో పాటు పదకొండు రకాల ఐడి కార్డులకు అనుమతి ఉంటుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. నేటి నుండే దేశంలో ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని ఆయన చెప్పారు.