ఉద్యోగ సంఘాల నేతల ఓవరాక్షన్‌

August 12, 2020

అలవిమాలిన స్వామిభక్తి
సామాజిక సాన్నిహిత్యంతోనే!
రాజధాని తరలింపు నిలిచిపోయినా
విశాఖ వెళ్లేందుకు సన్నద్ధంగా ఉండాలట!
20 లక్షల చొప్పున రుణాలిప్పిస్తారట!
సచివాలయ సంఘ నేత హడావుడి
మండిపడుతున్న ఉద్యోగులు
రాజధాని తరలింపు హైకోర్టు ఆదేశాలతో ఏనాడో ఆగిపోయింది. సదరు బిల్లుకు శాసనమండలిలో బ్రేకు పడింది. అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించడానికి వీల్లేదని హైకోర్టు తెగేసిచెప్పింది. అయినా దొంగచాటుగా అమరావతిని నిర్వీర్యం చేయడానికి జగన్‌ ప్రభుత్వం నక్కజిత్తులు ప్రదర్శిస్తోంది. సచివాలయ ఉద్యోగుల మనోభావాలతో సంబంధం లేకుండా.. వారిని మే నెలాఖరులోపు విశాఖకు తీసుకెళ్లాలన్న పట్టుదలతో ఉంది. నేరుగా వారితో సంప్రదించకుండా తమ మోచేతి నీళ్లు తాగే సచివాలయ ఉద్యోగ సంఘ నేతల ద్వారా నరుక్కురావాలని ఎత్తువేసింది. సీఎం జగన్‌ సామాజిక వర్గం, ఆ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి సామాజిక వర్గం ఒకటే కావడంతో.. సదరు నాయకుడు ఎక్కడ లేని స్వామిభక్తిని చాటుకుంటున్నారు. ఉద్యోగులతో మాట మాత్రమైన సంప్రదించకుండా.. ప్రభుత్వ ఉత్తర్వులు ఏ క్షణమైనా రావొచ్చు.. మే నెలాఖరులోపు విశాఖకు తరలివెళ్లడానికి సిద్ధమవ్వండని ఆయన ఆకస్మికంగా ప్రకటన చేసేశారు. ఆయన ఆ పదవికి ఎన్నికైన నాటి నుంచి ఇంతవరకు జనరల్‌ బాడీ సమావేశమే జరపలేదు. జనరల్‌ బాడీ  జరిపితే సమస్యలపై ఉద్యోగులు తనను నిలదీస్తారన్నది ఆయన భయం. ఆ విషయం తర్వాత. ఏ అధికారంతో, ఎవరు చెబితే ఆయన విశాఖ వెళ్లాలని చెబుతున్నారు. సచివాలయం కోసం వైజాగ్‌లో ఎక్కడ.. ఏ భవనాన్ని సిద్ధం చేశారని ప్రశ్నిస్తే వెంకట్రామిరెడ్డి నోరెత్తడం లేదు. తమకున్న సమాచారం ప్రకారం.. సచివాలయం మొత్తం ఒకేచోట ఉండే వెసులుబాటు కల్పించే పెద్దభవనం ఏదీ అక్కడ లేదని ఉద్యోగులు అంటున్నారు. సచివాలయాన్ని ఒక్క చోట కాకుండా ముక్కలు ముక్కలుగా చేసి అనేక చోట్ల పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అమరావతిలో ఉన్న సచివాలయంలో ఆఫీస్‌ స్పేస్‌ 5 లక్షల చదరపు అడుగులు ఉంది. ఈ స్థలం సరిపోక అనేక మంది సలహాదార్లకు ఇంకా చాంబర్లే కేటాయించలేదు. వారికి ఎటూ పనీపాటా లేదు కాబట్టి హైదరాబాద్‌లో తమ నివాసాల్లో ఉంటూ జీతభత్యాలు తీసుకోవడం వేరే సంగతి. సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ నుంచి ఇతర ఉన్నతాధికారులు, వైసీపీపీ నేత విజయసాయిరెడ్డి నుంచి మంత్రుల వరకు పదే పదే విశాఖ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తమ తమ కార్యాలయాలు, నివాసాల కోసం భవనాలు అన్వేషిస్తున్నారు. హైకోర్టు ఏమంటుందోనన్న భయం వీరికి ఏ మాత్రం లేదు. ఏదీ తేల్చకుండా.. తేలకుండా వేల మంది ఉద్యోగులు విశాఖ ఎలా వెళ్తారు? అసలు వైజాగ్‌లో 5 లక్షల చదరపు అడుగుల ఆఫీస్‌ స్పేస్‌ అందుబాటులో ఉన్న భవనాన్ని అధికారులు గుర్తించారో లేదో వెంకట్రామిరెడ్డి స్పష్టంగా చెప్పాలని ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. జనరల్‌ బాడీ సమావేశం కూడా నిర్వహించి తమ అభిప్రాయాలు సూచనలు తీసుకోకుండా.. ప్రభుత్వం చెప్పింది చేయాల్సిందే కదా అంటూ అడ్డగోలు ఆదేశాలు ఆదేశాలు జారీచేయడంపై మండిపడుతున్నారు. జనరల్‌ బాడీ సమావేశం పెట్టమంటే కరోనా వైరస్‌ పేరుతో తప్పించుకుంటున్న అధ్యక్షుడు గత నెల 20న సచివాలయంలో ఉగాది సంబరాలు ఎలా నిర్వహించారని నిలదీస్తున్నారు. ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సమావేశంలో తన మాటలకు ఆమోదం వేయించుకుని.. ఎన్నడూ లేని విధంగా ప్రెస్‌ మీట్‌ పెట్టి వివరాలు చెప్పడం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సంఘ సభ్యులకు మీడియా ద్వారా వివరాలు తెలియజేయడం విడ్డూరంగా ఉందంటున్నారు. సచివాలయ సంఘం ఉద్యోగులకు ప్రతినిధిగా వ్యవహరిస్తోందా.. లేక ప్రభుత్వానికి తాబేదారుగా వ్యవహరిస్తోందా అని దుయ్యబడుతున్నారు.
కోర్టులో తేలాలిగా..!
వికేంద్రీకరణ పేరుతో ఇప్పటికే సచివాలయంలో భాగమైన విజిలెన్స కమిషన, కమిషనరేట్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ని కర్నూలుకు తరలిస్తూ ఇచ్చిన జీవోను హైకోర్టు కొట్టివేసిందని.. 3 రాజధానులు-పాలనా వికేంద్రీకరణ బిల్లు వ్యవ
హారం ఇంకా న్యాయస్థానం విచారణలోనే ఉందని.. అక్కడ ఏమీ తేలకుండానే విశాఖ వెళ్లడానికి సిద్ధంగా ఉండాలంటూ అధ్యక్షుడు చెప్పడాన్ని ఉద్యోగులు తప్పుబడుతున్నారు. తమ పిల్లల చదువుల పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు. అమరావతి పరిధిలో సీబీఎస్‌ఈ స్కూళ్లలో చదివే పిల్లలను.. వైజాగ్‌ వెళ్లాక అక్కడి సీబీఎస్‌ఈ స్కూళ్లు ఎలా చేర్చుకుంటాయని నిలదీస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వంతో ఏమైనా మాట్లాడారా అని అడుగుతున్నారు. దీనికి వెంకట్రామిరెడ్డి నుంచి సమాధానం లేదు. కానీ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇళ్లు, స్థలాలు కొన్నవాళ్లుంటే వైజాగ్‌ వెళ్లాక ఆ ఉద్యోగులకు వడ్డీలేకుండా రూ.20 లక్షల రుణం ఇప్పిస్తానని ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఆయన చెప్పారు. ఇప్పుడున్న 30 శాతం హెచఆర్‌ఏ కొనసాగుతుందని.. కుటుంబంతో పాటు వచ్చే ఉద్యోగులకు అదనంగా మరో 10 శాతం హెచఆర్‌ఏ లేదా నెలకు రూ.4,000 అదనంగా ఇప్పిస్తానని.. విశాఖలో ఇళ్లస్థలాలు ఇప్పిస్తానని, అక్కడకు వెళ్లాక కొత్తగా 100 పోస్టులు సృష్టింపజేసి.. ప్రమోషన్లు కూడా ఇప్పిస్తానని హామీలు గుప్పించారు. వీటి అమలు పక్కనపెడితే.. ఉగాదికి రెండు డీఏలు ఇప్పిస్తానన్న ఆయన మాట గాలిమాటేనని తేలిపోయింది. ప్రభుత్వం నుంచి ఆ ప్రస్తావనే లేదు.
ప్రొఫార్మాపై హల్‌చల్‌
కనీసం తమ సమస్యలు, ఇబ్బందులు ఏమిటో తెలుసుకోకుండానే తమ వ్యక్తిగత డేటా, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలు ఇవ్వాలంటూ.. ఒక ప్రొఫార్మాను వెంకట్రామిరెడ్డి తమకు పంపడంపై ఉద్యోగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ఏ ఆదేశంతో తమ నుంచి ఈ వివరాలు కోరుతున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. దానిపై ప్రభుత్వం అడిగినట్లుగా గానీ, అసోసియేషన తరపున అడుగుతున్నట్లుగా గానీ అధ్యక్షుడి సంతకం, అసోసియేషన స్టాంపు ఏమీ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. పైగా ఇందులో ఉద్యోగి భార్య/భర్త పేర్లు, వారు ఎక్కడ ఉన్నారు? ఏం ఉద్యోగం చేస్తున్నారు? ఎంత మంది పిల్లలు.. వారెక్కడ చదువుతున్నారు? 2015 నుంచి 2019 మధ్య కాలంలో కృష్ణా/గుంటూరు జిల్లాల్లో ఇళ్లు, స్థలాలు ఏమైనా కొన్నారా.. వంటి వివరాలు అడిగారు. ఏసీబీ వలలో తమను ఇరికించేందుకే ఇవన్నీ అడుగుతున్నారని ఉద్యోగులు అనుమానిస్తున్నారు. అందుకే ఇళ్లు, స్థలాల వివరాలు చెప్పడానికి విముఖత చూపుతున్నారు. ఉద్యోగులకు నిజంగా వడ్డీ లేని రుణాలు ఇవ్వదలచుకుంటే బ్యాంకు లోన్లు ఉన్న ప్రతి ఉద్యోగికీ ఇవ్వాలని, దీనికోసం ఆస్తుల వివరాలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ప్రతి ఏడాదీ తాము వార్షిక ఆస్తుల వివరాలు ప్రభుత్వానికి సమర్పిస్తుంటామని.. వాటిని చూసి తెలుసుకుంటే సరిపోతుందని స్పష్టం చేస్తున్నారు.