కేసీఆర్, జగన్ కటీఫ్ నిజమేనా? కాదా?

December 14, 2019

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్‌ల మధ్య దోస్తీ ముగిసిందన్న ప్రచారం కొద్దికాలంగా జరుగుతోంది. ముఖ్యంగా గత నెల రోజుల్లో జరిగిన పలు పరిణామాలు అందుకు ఊతమిస్తున్నాయి. కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలని కేంద్రంపై ఆయన ఒత్తిడి తెస్తుంటే... కాళేశ్వరానికి జాతీయ హోదా అవసరం లేదని, అది అక్రమ ప్రాజెక్టు అని ఏపీలోని జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుల అఫిడవిట్ వేయడం ఇప్పుడు చర్చనీయంగా మారింది. కొద్దిరోజుల ముందు ఏపీలో ఆర్టీసీ విలీన ప్రక్రియ గురించి కూడా కేసీఆర్ వెటకారామాడారు. దీంతో ఇద్దరి మధ్య దోస్తీ ముగిసిందన్న ప్రచారం మొదలైంది.
కాగా కాళేశ్వరంపై ఏపీ అఫిడవిట్‌కు బదులుగా గట్టి జవాబుతో అఫిడవిట్‌ను ఇవ్వాలని తెలంగాణ సీఎం కేసీఆర్ సాగునీటి శాఖను ఆదేశించినట్లు సమాచారం. రానున్న రోజుల్లో ఏపీ దాఖలు చేసిన అఫిడవిట్‌ను సంపూర్ణంగా అధ్యయనం చేసి తగు రీతిలో సమాధానం ఇచ్చేందుకు తెలంగాణ సాగునీటి శాఖ సమాయత్తమవుతోంది. వచ్చే వారం ఏపీ అఫిడవిట్‌పై చర్చించి సుప్రీం కోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసే విషయమై ఉన్నతాధికారుల సమావేశాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ విషయమై న్యాయ కోవిదుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది. ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరైన విషయం తెలిసిందే.
ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే విషయమై జగన్ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై ఒక హైలెవల్ కమిటీని ఏపీ సర్కార్ నియమించింది. ఈ కమిటీ ఇచ్చే నివేదికపై ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఇదిలావుండగా, తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు గత 44 రోజులుగా సమ్మె చేసేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా ఒక కారణమని చెప్పవచ్చు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఏపీ సర్కారుకు లేని ఇబ్బందులు తెలంగాణ సర్కారుకు ఎక్కడి నుంచి వస్తాయని ఇక్కడి కార్మిక సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. కాగా, ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడం సాధ్యం కాదంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతూ ఏపీలో పిచ్చి ప్రయత్నం చేస్తున్నారన్నారు. దీంతో.. కేసీఆర్ వ్యాఖ్యల తరువాత వెంటనే విలీన ప్రక్రియ పూర్తిచేయాలని జగన్ ఆదేశించారని ఏపీ రవాణా మంత్రి పేర్ని నాని చెప్పారు. ఇద్దరు సీఎంల మధ్య సయోధ్య బెడిసికొట్టిందనడానికి ఇవన్నీ ఉదాహరణలుగా కనిపిస్తున్నాయి.
నిజానికి ఈ ఏడాది మే 30వ తేదీన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు వ్యక్తిగతంగా కేసీఆర్ ఇంటికి వచ్చి విజయవాడకు ఆహ్వానించడం, కేసీఆర్ వెళ్లడం రెండూ జరిగాయి. ఆ తర్వాత కూడా సాగునీటి ప్రాజెక్టులు, గోదావరి నుంచి కృష్ణా నదికి నీటి మళ్లింపుపై ఇద్దరు సీఎంలు ఇక్కడ భేటీ అయి కూలంకషంగా చర్చించారు.  జగన్ సీఎం అయిన తర్వాత సచివాలయంలో ఏపీకి చెందిన భవనాలను మాత్రం తాము ఉపయోగించబోమని అప్పటి ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి అప్పజెప్పారు. ఈ నిర్ణయాన్ని ఆంధ్రాలో ప్రతిపక్ష పార్టీ టీడీపీ ఘాటుగా విమర్శించింది. అలాగే సాగునీటి ప్రాజెక్టులపై కూడా రాష్ట్ర ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని వ్యవహరించాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కోరారు. ఏపీ అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా జగన్ మాట్లాడుతూ కేసీఆర్ ఉదారతను, సాగునీటి రంగంపై ఉన్న అవగాహనను ప్రశంసించారు. ఇవన్నీ చూసిన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య స్నేహబంధం సాగుతుందని అనుకున్నారు. కానీ గత నెలన్నర రోజుల్లో చోటుచేసుకున్న పరిణామాలు మాత్రం కేసీఆర్, జగన్ మధ్య దూరాన్ని పెంచాయి.
అయితే, నిజంగానే ఇద్దరి మధ్యా చెడిందా లేదంటే విపక్షాలను, ప్రజలను సంతృప్తి పరచడానికి టెక్నికల్‌గా వ్యవహరిస్తున్నారా అన్న అనుమానాలూ రాజకీయ వర్గాలలో వినిపిస్తున్నాయి. కాళేశ్వరంను జగన్, పోలవరంను తెలంగాణ ప్రభుత్వం అనేక కారణాల దృష్ట్యా వ్యతిరేకించాలి కాబట్టి కోర్టులో వ్యతిరేకిస్తూ అఫిడవిట్‌ను దాఖలు చేశాయా? వీటితో సంబంధం లేకుండా ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య స్నేహబంధం భవిష్యత్తులో కొనసాగుతుందా? అనేది వేచి చూడాలి.
అయితే.. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి జగన్ పోలవరం నుంచి శ్రీశైలంకు ఆంధ్ర భూభాగం ద్వారానే గుంటూరు జిల్లా ద్వారా నీటిని మళ్లించే విషయమై డీపీఆర్‌ను రూపొందించాలని సాగునీటి శాఖను ఆదేశించారు. అంతకుముందు దుమ్ముగూడెం నుంచి నాగార్జునసాగర్‌కు నీటిని ఎత్తిపోతల స్కీం ద్వారా మళ్లిస్తూ, అక్కడి నుంచి శ్రీశైలంలోకి మళ్లించాలనే ప్రతిపాదనను, తుపాకుల గూడెం వద్ద గోదావరి నుంచి శ్రీశైలంకు ఎత్తిపోతల ద్వారా నల్లమల అడవుల గుండా నీటిని మళ్లించాలనే ప్రతిపాదనను ఇద్దరు సీఎంలు చర్చించారు. అయితే, ఇవన్నీ ఆచరణయోగ్యం కావని, భవిష్యత్తులో వివాదాలకు దారితీస్తాయని రెండు రాష్ట్రాలకు చెందిన పలువురు సాగునీటి నిపుణులు అప్పట్లోనే విమర్శించారు. జగన్ కూడా ఎందుకైనా మంచిదని ఈ ప్రాజెక్టును ఏపీలోంచే చేపట్టాలనుకుంటున్నారట.
అయితే, రాష్ట్రాల మధ్య సమస్యలకు సంబంధించి న్యాయపరమైన విషయాల్లో వీరిద్దరూ చేయాల్సిన పని చేస్తూనే వ్యక్తిగతంగా దోస్తీ కొనసాగిస్తారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. తెలంగాణలో ఆర్టీసీ ఇష్యూ ముగిశాక మళ్లీ ఇద్దరు సీఎంలు భేటీ అవుతారనీ అంచనా వేస్తున్నారు. చూడాలి ఏం జరుగుతుందో.. ఇద్దరు సీఎంల స్నేహం పుబ్బలో పుట్టి మఖలో ముగుస్తుందా, సుదీర్ఘ కాలం కొనసాగుతుందా అన్నది చూడాలి.