హైకోర్టును లెక్కచేయని జగన్... కొత్త జీవో

August 04, 2020

హైకోర్టు ఏమైనా ప్రభుత్వమా? వారు చెప్పింది అమలు చేయాల్సింది నేనే. పోలీసులు నా వాళ్లే. ఇక నేను కోర్టుకు భయపడేది ఏంటి? అన్నట్టుంది జగన్ అభిప్రాయం. తెలుగు మీడియం రద్దు చేస్తూ ఇచ్చిన జీవోను ఏపీ హైకోర్టు కొట్టి పారేసింది. అయినా జగన్ లెక్కచేయకుండా తాజాగా కొత్త జీవో తెచ్చారు. తన వలంటీర్ల ద్వారా సేకరించిన అభిప్రాయాల్లో తల్లిదండ్రులు 96 శాతానికిపైగా ఇంగ్లిష్ మీడియం కోరుకున్నారు కాబట్టి ప్రజాభిప్రాయం మేరకు ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు పెట్టినట్లు కోర్టులో వాదించొచ్చు అన్న ధైర్యంతో జగన్ సర్కారు దీనికి తెగబడింది.

కొత్త జీవో ప్రకారం 1-6వ తరగతి వరకు అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఇంగ్లిష్ మీడియం ఉంటాయి. ప్రతి మండలానికి ఒక తెలుగు మీడియం పాఠశాల ఉంటుంది. తెలుగు మీడియంలో చదవాలనుకునేవారు మండలకేంద్రంలోని స్కూలుకు వెళ్లి చదువుకోవచ్చు. ఈ మేరకు విద్యా శాఖ నుంచి జీవో నెం.24 జారీ అయ్యింది. ఇందులో గవర్నమెంటు విచిత్రమైన సమర్థన చేసుకుంది. ‘‘రాజ్యాంగం సూచించిన విలువలు ఆంగ్లమాధ్యమంతో విద్యార్థుల్లో పెరుగుతాయి. మాతృభాషలో పిల్లలు ప్రావీణ్యత సాధించడానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూనే, ఇతర సబ్జెక్టుల్లో సమగ్ర నైపుణ్యానికి ఒకటో తరగతి నుంచే ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుంది. ఆంగ్ల మాధ్యమం ద్వారా అనుకున్న లక్ష్యాలు నెరవేరతాయి‘‘ అని జీవోలో పేర్కొన్నారు.  

ఇప్పటికే గవర్నమెంటు స్కూళ్లలో  ఆంగ్ల మాద్యమాన్ని తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆ రెండు జీవోలు 81, 85ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఏ మీడియంలో చదుకోవాలి అన్నది విద్యార్థులు, తల్లిదండ్రుల ఇష్టమని అభిప్రాయపడింది. దీనిపై ప్రభుత్వం విద్యార్థుల నుంచి వారి తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు సేకరించి తాజాగా ఇంగ్లీష్ మీడియం పై SCERT ఇచ్చిన రిపోర్ట్  ఆధారంగా పాఠశాల విద్యా కమిషనర్ పేరు మీద గవర్నమెంటు జీవో జారీ చేశారు.