బస్సు జర్నీ.. సమూలంగా మారిపోయినట్లే

August 09, 2020

ప్రపంచాన్ని చుట్టేసిన మాయదారి రోగంతో ప్రత్యేక పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మానవ జీవితంలో మాయదారి రోగానికి ముందు.. తర్వాత అన్న విభజన ఖాయం. ప్రతి విషయంలోనూ మార్పు తప్పనిసరి. మరి.. ప్రజారవాణాలో కీలక భూమిక పోషించే బస్సు జర్నీ ఎలా ఉండనుందన్నది ప్రశ్నగా మారింది. ఇప్పటివరకూ అందుతున్న సమాచారం ప్రకారం.. బస్సు ప్రయాణం మొత్తంగా మారిపోతుందని చెబుతున్నారు.
ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితి తక్కువలో తక్కువ ఏడాది పాటు సాగే అవకాశం ఉందని.. ఈ నేపథ్యంలో బస్సులు తిప్పకుండా ఆపటంతో ఎలాంటి ప్రయోజనం లేదంటున్నారు. ఈ కారణంతోనే మధ్యే మార్గంగా బస్సు ప్రయాణం రూపురేఖలు మొత్తం మారిపోనున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా కాస్త బలంగా తుమ్మినా.. దగ్గినా వణికే పరిస్థితి. మరి.. బస్సు ప్రయాణంలో పక్కనే కూర్చున్న వ్యక్తులతో మరింత అప్రమత్తంగా ఉండాలి.
ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న అధికారులు ఆర్టీసీ బస్సుల్లో సమూల మార్పుల్ని తీసుకొచ్చే అవకాశాలే ఎక్కువని చెబుతున్నారు. ఇప్పటివరకూ బస్సులో ఉండే కుడి.. ఎడమ సీట్లలో.. ఒక్కొకరు మాత్రమే కూర్చునే అవకాశాన్ని ఇస్తారట. అంతేకాదు.. సూపర్ లగ్జరీ బస్సుల్లోనూ సీటింగ్ మారిపోనుంది. ప్రతి వరుసలోనూ రెండు చొప్పున సీట్లు ఉంటాయి. వాటిల్లోనూ ఒక్కరు చొప్పునే అనుమతి ఇస్తారు. ఇప్పటివరకూ రెండేసి సీట్లు ఉన్న స్థానే.. వాటిని తొలగించి.. సింగిల్ సీట్లను ఏర్పాటు చేయనున్నారు. అంటే.. నలుగురు కూర్చునే పాత పద్దతికి చెల్లు చీటి ఇచ్చేయటం ఖాయమంటున్నారు.
పల్లెవెలుగు.. ఎక్స్ ప్రెస్్ బస్సుల్లోనూ సీటింగ్ లో మార్పు రానుంది. ఉన్న సీటింగ్ లో ఒక్కొక్కరు తప్పించి.. అంతకు మించి ఎక్కువమందిని అనుమతించే అవకాశం లేదు. అంతేకాదు.. కిక్కిరిపోయే సిటీ బస్సుల్లో నిలబడే అవకాశం లేకుండా నడపనున్నారు. కనీసం ఏడాది పాటు ఈ తరహాలో ప్రయాణించక తప్పని పరిస్థితి. వీటిల్లో కూడా సీట్లలో ఒక్కరిని మాత్రమే అనుమతిస్తారు. వినేందుకు ఇబ్బందిగా ఉన్న ఈ విధానం..ఆచరణలో మరింత కష్టంగా ఉంటుందంటున్నారు. ఇంత తక్కువమంది ప్రయాణికుల్ని అనుమతించిన పక్షంలో.. టికెట్లధరలు మరింత భారంగా మారే ప్రమాదం కూడా పొంచి ఉందన్నది మర్చిపోకూడదు.