ఏంటో... తెలంగాణ అట్ల నడిచిపోతోంది

June 01, 2020

ఏంటో... తెలంగాణ అట్ల నడిచిపోతోంది. భూమి బద్ధలవుతున్నా... కొంపలు తగలబడిపోతున్నా ఇక్కడ అడిగే వాడు ఉండడు. పొరపాటున ఉన్నా బతక నివ్వరు. ఆవేశంతో ఎవడైనా నోరెత్తితే వాడు తెలంగాణ ద్రోహైపోతాడు. 20 మంది పిల్లలు చచ్చినా... ప్రగతి భవన్ స్పందించదు. ఈ రాష్ట్రం దేశానికి ఆదర్శం అంటారు. ఎలా ఆదర్శమో...ఎందుకు ఆదర్శమో తెలియదు... ఆదర్శం అంతే! పరిపాలన చేయాలంటే సెక్రటేరియట్ కే రావాలా? అంటారు. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే సెక్రటేరియట్ అని సమర్ధించుకుంటారు. ఇక్కడంతే... అంతా వారి ఇష్టం.

ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం ముందు విద్యార్థులు, తల్లిదండ్రులు బోరున విలపిస్తుంటారు. నడిరొడ్డు పై ఎర్రటి ఎండలో పొర్లు దంణ్ణాలు పెడుతుంటారు. ఈ విషయాన్ని మీడియా కవర్ చేయకూడదు. చేసినా ప్రభుత్వాన్ని, దాని పెద్దలను నొప్పించ కూడదు. అదేదో ఇంటర్మీడియట్ బోర్డు పాపంగా తేల్చేయాలి. కాదు ప్రభుత్వానిదే బాధ్యత అంటే కోపం. అయ్యో పాపం అంటే పాపం... అనకూడదు. ఎవరూ ఏమీ అనకూడదు. అందరూ అంతా బాగుంది అనుకుంటూ బతికేయాలి. అంతా బ్రహ్మాండం అని భ్రమించాలి. పెన్షన్ ఇస్తారు... ఇస్తారో లేదో తెలియదు.. ఇస్తే తీసుకుని సంతోషపడాలి. రైతుబందు ఇస్తామంటారు... మహాప్రసాదం అనుకోవాలి. వ్యవస్థలు పతనం అవుతుంటాయి... ఐతే అవనీయండి... మీకేంటి సంబంధం... మీకు ఇవ్వాల్సినవి ఇస్తున్నాం, ముట్టాల్సినవి ముడుతున్నాయి కదా!? ఇదీ గుణాత్మక మార్పు అంటే. భవనాలు శిథిలావస్థకు వస్తే కూలిపోవా... ఇవీ అంతే! ఓ వైపు ఇంటర్మీడియట్ బోర్డు ముందు రణరంగంగా ఉంటుంది. 9.30 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా ఉంటుంది. అదే సమయంలో కేటీఆర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలతో ఫోటోలకు ఫోజులిస్తుంటారు. పుష్ఫగుచ్ఛాలు తీసుకుంటూ చిరునవ్వులతో చాయాచిత్రాలు దిగి మీడియాకు పంపుతుంటారు. ఇవి చూస్తే... సామాన్యుడిగి కడుపు మండిపోతుంది.

కానీ, రూల్ ప్రకారం అలా మండిపోకూడదు... దానిపై చన్నీళ్లు చల్లి చల్లార్చేసుకోవాలి. కాదు కూడదని ప్రశ్నిస్తే... ద్రోహులైపోతారు. విద్యామంత్రిది వితండ వాదం. ఇప్పుడే జరిగుతున్నాయా ఇవన్నీ...!? గతంలో జరగలేదా అంటారాయన. అంతా వాళ్లే చేశారంటారు... గత పాలకుల దుర్మార్గమంటారు. చర్చకు సిద్ధమంటారు... అంటే... మీరు గత పాపాలకు కొనసాగింపు అనుకోవాలా!? అన్నింటికీ ఎదురు దాడే. ఎడ్డెం తెడ్డెం వాదన చేస్తే సరి! ఎదుటి వాడు గుక్కతిప్పుకోకుండా వాదించడమే ఇప్పుడు ట్రెండ్... ఇక్కడ ప్రశ్నలు వేయకూడదు...

సమాధానాలు అడగ కూడదు... వినే ఓపికలు ఉండవు... జరిగిన దానికి చింతించే మనసులు ఉండవు. అయ్యో పాపం అనుకోకూడదు. అన్నీ పాపాలను గతంలోకి తోసేయడమే. పుణ్యాలు ఉంటే మాత్రం ఖాతాలో వేసుకుంటారు. ఎవడో ఫేస్ బుక్ లో గుంట భూమి పంచాయితీ గురించి వీడియో పెడితే ముఖ్యమంత్రి స్పందిస్తారు. వందల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం ముందు గుండెలవిసేలా గోడు వెళ్లబోసుకుంటుంటే అదే ముఖ్యమంత్రి ఎందుకు స్పందించరో అర్థం కాదు. అదేమంటే... మీకు తెలిసేటట్టు స్పందించాలా... ఎప్పుడు స్పందించాలో, ఎలా స్పందించాలో మీరు చెబితే నేర్చుకోవాలా అంటారు...ఏంటో ఇవేవీ అర్థం కావు. అర్థం కాకపోయినా అర్థమైనట్టుగానే ఉండాలి. అదేగా చెబుతోంది...! ఇక్కడ అంతా బాగానే ఉందనుకోవాలి... అన్నీ అర్థమయ్యాయని సరిపెట్టుకోవాలి...

ఏం అర్థం కాకపోయినా, ఏం బాగోలేదనిపించినా... అలాంటోళ్లంతా సన్నాసులు, దద్ధమ్మలు. ఇక మీరే తేల్చుకోండి. మీరు సన్నాసులో... దద్ధమ్మలో!