ఈరోజు పౌర్ణమికి, మన తినే తిండికి సంబంధమేంటి?

August 14, 2020

రైతు లేకపోతే... మనకు తిండి లేదు. మనం స్పేస్ టెక్నాలజీ అభివృద్ది చేసినా తిండి తినకుండా అయితే బతకలేం. అందుకే మనం బతకాలంటే రైతు బతకాలి. రైతు బతకాలి అంటే ఏరు వాక పౌర్ణమి తో పాటు వర్షాలు రావాలి. ఈరోజు ఏరువాక పౌర్ణమి. పుడమి తల్లిపై ఏరువాక పౌర్ణమి నాడు తొలకరి చిరుజల్లులు కురిస్తే అది అదిపెద్ద పండగ.

చైత్రం, వైశాఖం ముగిశాక... జేష్టమాసంలో వచ్చే పౌర్ణమినే ఏరువాక పౌర్ణమి అంటాం. ఇది దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్టాల్లో పంట పనులు మొదలు కావడానికి సూచిక. ఏరువాక అంటే పొలాన్ని దున్నడం. సరిగ్గా జేష్టంలో దున్నడం మొదలవుతుంది కాబటి... మనం ఏరువాక పౌర్ణమి అంటాం. ఒకపుడు ఈ క్యాలెండర్లు అవీ ఉండేవి కాదు కాబట్టి కాలానుగుణమైన సంకేతాలతోనే అన్నీ అంచనాలు వేసే వారు. అలా ఏరువాక పౌర్ణమి వస్తుందటే... వ్యవసాయ పనులకు సిద్ధం కావాలని సంకేతాలన్నమాట.

ఇది కాలక్రమంలో ఒక పండగగా మారింది. ఈ పండగ రోజున రైతులు వ్యవసాయ పనిముట్లకు ఆయుధ పూజలా పుసుపు కుంకుమ పెట్టి పూజ చేస్తారు. దాదాపు దేశంలో 80 శాతం వర్షాలు తెచ్చేది నైరుతే కాబట్టి ఈ పౌర్ణమికి దేశమంతటా ప్రాముఖ్యం ఉంది.  పంటలు బాగా పండాలని రైతులు దేవదేవతలను కోరుకుంటారు. 

ఈ జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి రోజు ఒడిశాలోని పూరీలో శ్రీ జగన్నాథ స్వామికి స్నానోత్సవం నిర్వహిస్తారు. జగన్నాథ, సుభద్ర, బలరాములకు స్నానవేదికపై స్నానం చేయించి, పదిహేను రోజుల పాటు విశ్రాంతి కోసం ఏకాంతంగా ఉంచుతారు. తిరిగి ఆషాఢ శుద్ధ పాడ్యమి రోజున స్వామి వారి దర్శనం భక్తులకు లభిస్తుంది.