ఈవీఎంలు కొంప ముంచాయా...?

July 04, 2020

ఈవీఎంలు కొంప ముంచాయా....? ఎవరి కొంప ముంచాయి...? ఏ పార్టీకి నష్టం జరుగుతుంది...? ఇప్పడు చర్చంతా ఇదే. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 372 ఈవీఎంలు సాంకేతిక కారాణలతో మొరాయించాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది  తెలిపారు. ఈవీఎంలలో లోపాలను ఇంజినీర్లు సరిచేస్తున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వందలాది పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో కొన్నిచోట్ల పోలింగ్ చాలా ఆలస్యంగా మొదలైంది. ఇంకొన్నిచోట్ల, క్యూలో గంటలతరబడి నిలబడే ఓపిక లేని ఓటర్లు కొందరు, ఆగ్రహం-అసహనంతో మరికొందరు ఓటర్లు ఓటు వేయకుండానే వెనుదిరిగారు. దీనిపై టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఈసీపై తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. సాంకేతిక కారణాలతో కొన్నిచోట్ల ఈవీఎంలు పనిచేయకపోవడంపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా 30 శాతం ఈవీఎంలు పనిచేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయా ప్రాంతాల్లో వెంటనే రీపోలింగ్ నిర్వహించాలని కోరారు. ఎన్నికల సంఘం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. పోలింగ్ ప్రారంభమైన మూడు గంటల వరకు కూడా ఈవీఎంలు పనిచేయలేదంటూ తమకు ఫిర్యాదులు వచ్చాయని చంద్రబాబు వివరించారు. కొన్నిచోట్ల ఈవీఎంలలో టీడీపీకి ఓటేస్తే వైసీపీకికి వెళ్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఈసీకి రాసిన లేఖలో సీఎం తెలిపారు. విజయవాడ లో తెలుగు దేశం పార్టీకి వేస్తే వైకాపాకి వెళ్ళిందని ఒక ఓటరు ఆవేదన వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు తెదేపా బలమైన ప్రదేశాల్లో ఈవీఎంలు పనిచేయడం లేదని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 157 పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఈసీకి టీడీపీ ప్రతినిధులు వినతిపత్రమిచ్చారు. EVMల పనితీరు సరిగ్గా లేని కారణంగా ఓటర్లు అనేకమంది ఓటు వేయలేదని, ఇది పోలింగ్‌ శాతంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలింగ్‌ జాప్యమైన చోట ఓటింగ్‌ సమయం పెంచేందుకు ఈసీ నిరాకరించడంపై కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.