బాబు ద‌గ్గ‌ర కింగ్‌... కేసీఆర్ తో చేరాక?

July 04, 2020

మండవ వెంకటేశ్వరరావు....ఒకప్పుడు ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన నేత. నాటి స‌మైక్యాంధ్ర సీఎంకు రైట్ హ్యాండ్‌గా ఉండ‌డంతో పాటు నిజామాబాద్ జిల్లా రాజ‌కీయాల‌ను సైతం శాసించారు. ఎన్నో ఏళ్ళు నిజామాబాద్ టీడీపీలో సేవలు చేసిన వ్యక్తి. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి....మంత్రిగా కూడా పని చేసిన నాయకుడు. అయితే అలా రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న మండవ.... రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు పూర్తిగా దూరమైపోయారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు పోటీ చేయ‌మ‌ని చెప్పినా పోటీకి దూరంగా ఉన్నారు. ఇక ఆ తర్వాత మళ్ళీ ఆయన కనపడలేదు.
ఈ క్రమంలోనే 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో మండవ టీడీపీలో మళ్ళీ కనిపించారు. టీడీపీ-కాంగ్రెస్ పొత్తులో పోటీ చేసిన విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా టీడీపీకి 13 సీట్లలో పోటీ చేసే అవకాశం దక్కింది. దీంతో మండవ నిజామాబాద్ రూరల్ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ప్రచారాలని కొట్టిపారేస్తూ..మండవ పోటీకి దూరంగా ఉంటూనే టీడీపీకి మద్ధతు పలికారు.
ఇక ఆ ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చాయో అందరికి తెలుసు. కాంగ్రెస్-టీడీపీలో ఘోరంగా ఓడిపోయాయి. టీఆర్ఎస్ భారీ మెజారిటీతో రెండోసారి అధికారంలోకి వచ్చింది. దీంతో మండవ మరోసారి అడ్రెస్ లేకుండా వెళ్ళిపోయారు. అయితే అసెంబ్లీ ఎన్నికల జరిగిన నాలుగు నెలల తర్వాత లోక్ సభ ఎన్నికలు వచ్చాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి.  ఈ సమయంలోనే పోటీ మరి ఎక్కువగా ఉందని భావించిన కేసీఆర్...నిజామాబాద్ నుంచి పోటీ చేస్తున్న తనయ కవిత గెలుపు కోసం కొత్త ప్లాన్ వేశారు.
గతంలో టీడీపీలో మండవతో కలిసి పని చేసిన చొరవతో... రాయబారానికి ఎవరిని పంపకుండా డైరెక్ట్ గా కేసీఆర్ స్వయంగా మండవ ఇంటికి వెళ్ళి పార్టీలోకి ఆహ్వానించారు. స్వయంగా కేసీఆరే ఇంటికి వచ్చి ఆహ్వానించడంతో మండవ కాదనలేదు. టీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయారు. మళ్ళీ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. నిజామాబాద్ లో కవితని గెలిపెంచేందుకు కృషి చేశారు. కానీ ఫలితం దక్కలేదు. పసుపు బోర్డు విషయంలో 178 మంది రైతులు పోటీ చేయడం, దేశవ్యాప్తంగా మోడీ హవా ఉండటంతో బీజేపీ అభ్యర్ధి అరవింద్ విజయం సాధించారు.
ఇక కవిత ఓటమితో మండవ ఆశలు ఆవిరైపోయాయి. ఎందుకంటే మండవ టీఆర్ఎస్ లోకి వస్తే ఎమ్మెల్సీ పదవి ఇచ్చి, మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. మంత్రి కాకపోయినా, మండలి చైర్మన్ అయినాన ఇస్తారని వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా కవిత ఓడిపోవడంతో మండవకు అలాంటి ఛాన్స్ దక్కలేదు. ఇటీవలే కేసీఆర్ పూర్తి మంత్రివర్గ విస్తరణ చేసేశారు. అటు శాసన మండలి ఛైర్మన్ పదవి గుత్తా సుఖేందర్ రెడ్డికి కట్టబెట్టేశారు. దీంతో మండవకు ఇవ్వడానికి ఏమి మిగలేదు. మొత్తం మీద మండవ మరోసారి రాజకీయాలకు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది.