టైం చూసి భారీ దెబ్బేసిన మోడీ

August 13, 2020

కరోనాతో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు తెగ ఇబ్బంది పడుతున్నాయి. కిందామీదా పడుతున్న ఆయా దేశాల కారణంగా ప్రపంచ ఆర్థిక పరిస్థితి ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకుంది. ప్రపంచం మొత్తానికి ఇప్పుడు కరోనా ఫీవర్ పట్టి పీడిస్తుంది. అంతర్జాతీయంగా చోటుచేసుకున్న పరిణామాలతో ముడి చమురు ధరలు భారీగా తగ్గిపోయాయి.
దీంతో.. మొన్నటి దాకా లీటరు పెట్రోల్ రూ.80ప్లస్ కాస్తా.. ఇప్పుడు అమాంతం తగ్గిపోయింది. లీటరు డీజిల్ రూ.80కు రెండు.. మూడు రూపాయిల దూరంలో ఉన్నది కాస్తా.. ఇప్పుడు రూ.68కు పడిపోయింది. కరోనా సంగతేమో కానీ.. పెట్రో ఉత్పత్తుల ధరలు భారీగా తగ్గిపోవటం కొంత ఉపశమనాన్ని కలిగించే పరిస్థితి. ఇలాంటి వేళ.. అందరూ అంచనా వేసినట్లే.. మోడీ సర్కారు ప్రజల వీపు మీద విమానం మోత మోగేలా లీటరుకు రూ.3 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతూ నిర్ణయాన్ని తీసుకున్నారు.
యూపీఏ హయాంలో అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినా.. అందుకు తగ్గట్లు పెట్రోల్.. డీజిల్ ధరలు పెంచేందుకు వెనుకాడేవారు. ప్రజల్లో వ్యతిరేకత వస్తుందన్న సందేహాలు వినిపించేవి. ఒకవైపు పెట్రో బిల్లు తడిచి మోపెడు అవుతున్నా.. భరించేవి. ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. పెట్రోల్.. డీజిల్ మీద ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వటం మానేసి.. దాన్నో ప్రధాన ఆదాయవనరుగా మార్చుకున్న పరిస్థితి.
అంతర్జాతీయంగా ధరలు భారీగా తగ్గినప్పుడు.. అందుకు తగ్గట్లు దేశీయంగా ధరలు తగ్గించాల్సి ఉంది. అయితే.. అలా చేస్తే.. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కోల్పోయే అవకాశం ఉంది. ఉదాహరణకు లీటరు పెట్రోల్ రూ.80 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు 20 శాతం పన్ను అనుకుంటే రూ.16 మేర ప్రభుత్వ ఖజానాకు వెళుతుంది. అదే లీటరు పెట్రోల్ రూ.70కు తగ్గితే దానికి తగ్గట్లే 20 శాతం పన్నుకు రూ.14 మాత్రమే ప్రభుత్వానికి వెళుతుంది. అంటే.. లీటరుకు రూ.2 మేర ప్రభుత్వానికి రావాల్సి ఆదాయం తగ్గుతుంది.
దీన్ని భర్తీ చేసుకునేందుకు.. పెట్రో ధరలు తగ్గినంతనే.. ఎక్సైజ్ సుంకం పెంపు పేరుతో వడ్డించే వడ్డింపుతో ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన సొమ్ములకు అదనంగా వచ్చేసే పరిస్థితి. ఏతావాతా చూస్తే.. అంతర్జాతీయంగా పెట్రో ధరలు పెరిగితే.. ఆ భారం వెంటనే ప్రజల నెత్తిన పడితే.. తగ్గినప్పుడు ప్రభుత్వ ఆదాయానికి వచ్చే లోటును లెక్కేసి.. దాన్ని ప్రజల మీద వేస్తున్న వైనం కనిపిస్తుంది. ఇక్కడ మరో విషయాన్ని మర్చిపోకూడదు. బ్యారెల్ ధర 50 డాలర్లు కాస్తా 35 డాలర్లు అయినప్పుడు.. అందుకు తగ్గట్లు వచ్చే 15 డాలర్ల ప్రయోజనం ప్రజలకు అందకపోగా.. కొత్తగా పెంచే పన్ను భారం ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మారుతోంది.
ఏమైనా.. పెట్రో ధరలు తగ్గాయన్న ఆనందపడే సమయానికి ఎక్సైజ్ పన్ను పెంపుతో.. ఆ సంతోషం ఆవిరి అయ్యేలా చేస్తున్నారని చెప్పక తప్పదు. ప్రస్తుతంఅంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు బ్యారెల్ 35 డాలర్లుమాత్రమే పలుకుతుంది. దీని కారణంగా వచ్చే ప్రయోజనంతో పాటు.. ప్రజల మీద వేస్తున్న కొత్త పన్నుతో కేంద్ర ఖజానాకు కాసుల గలగల ఖాయమని చెప్పక తప్పదు.