చిరంజీవి కోసమే రెడీ చేశారట...

August 05, 2020

మెగా ఫ్యామిలీ నుంచి ఏ కొత్త నటుడు వచ్చినా.. చిరు ఆశీర్వాదం ఉంటుంది. వాళ్ల అరంగేట్రాన్ని చిరు జాగ్రత్తగా పర్యవేక్షిస్తారు. కథ వింటారు. స్క్రిప్టులో మార్పులు చేర్పులు చెబుతారు. కుదిరితే మేకింగ్ మీదా ఓ కన్నేస్తారు. మధ్యలో రషెస్ చూస్తారు. వీటిలో ఏవి మిస్సయినా కూడా సినిమా విడుదలకు ముందు ప్రివ్యూ కచ్చితంగా చూస్తారు. ఆయన సంతృప్తి వ్యక్తం చేశాక సినిమా థియేటర్లలోకి దిగుతుంది.

మెగా ఫ్యామిలీ నుంచి రాబోతున్న కొత్త హీరో, సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ విషయంలోనూ పద్ధతి తప్పట్లేదు. అతను హీరోగా నటించిన తొలి సినిమా ‘ఉప్పెన’ ప్రారంభోత్సవంలో చిరు పాల్గొన్నారు. తర్వాత కొంత రష్ చూశారు. ప్రివ్యూ కూడా ఎప్పుడో చూడాల్సింది.

 

కానీ కరోనా వచ్చి అడ్డు కట్ట వేసింది. ఏప్రిల్ 2నే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా లాక్ డౌన్ వల్ల వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.

ఇప్పుడు లాక్ డౌన్ చివరి దశలో ఉంది. థియేటర్లు మినహా అన్నీ తెరుచుకుంటున్నాయి. వాటిని కూడా నెలా రెండు నెలల్లో ఓపెన్ చేసే అవకాశముంది. థియేటర్లు పున:ప్రారంభం అయ్యాక తెలుగులో తొలి దశలో విడుదలయ్యే సినిమాల్లో ‘ఉప్పెన’ ఒకటి కాబోతోంది. ఈ సినిమాను ఇప్పటికే కొందరు సినీ ప్రముఖులు చూశారు. ఈ చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సానా గురువైన సుకుమార్ కూడా సినిమా చూసి థమ్సప్ చెప్పారట. ఇక చిరు చూసి ఓకే చేయాల్సి ఉంది.

లాక్ డౌన్ టైంలో చిరు సినిమా కార్యకలాపాలేమీ పెట్టుకోకపోవడంతో ‘ఉప్పెన’ చూడలేకపోయారు. ఇప్పుడాయన కొన్ని రోజుల్లోనే ‘ఆచార్య’ షూటింగ్‌కు వెళ్లబోతున్నారు. ఆలోపే ‘ఉప్పెన’ చూడబోతున్నారు. ఆయనకు సినిమా నచ్చిందంటే ధీమాగా విడుదల కోసం వెయిట్ చేయొచ్చని.. ఏవైనా కరెక్షన్లు చెప్పినా చేసుకోవడానికి సమయం ఉందని అంటున్నారు. చిరు ఇంట్లోనే ‘ఉప్పెన’ ప్రివ్యూకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం.