ఫ‌డ్న‌వీస్ రాజీనామా...అజిత్ షాక్‌తో అవాక్కు

June 01, 2020

మహా ట్విస్ట్‌లు కొన‌సాగుతున్నాయి. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌నుమ మించిన ఎపిసోడ్‌ల‌తో రాష్ట్ర రాజ‌కీయాలు సాగుతున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీలో బుధవారం సాయంత్రం 5 గంటల్లోపు బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన గంట‌ల వ్య‌వ‌ధిలో ఆ రాష్ట్ర రాజ‌కీయం పూర్తిగా మారిపోయింది. ఎవరూ ఊహించని విధంగా.. డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన ఎన్సీపీ నాయకుడు అజిత్‌ పవార్‌.. ఇవాళ అదే పదవికి రాజీనామా చేశారు. అజిత్‌ పవార్‌ రాజీనామా చేసిన కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే..ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ సైతం రాజీనామా చేశారు.

నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్‌ పార్టీ శాసనసభాపక్ష నేత పదవిలో ఉన్న అజిత్‌పవార్, త‌న‌తో పాటు వచ్చిన 32 మంది ఎమ్మెల్యేల మద్దతుతోనే మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అనంత‌రం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అయితే, దీనిపై పార్టీ భ‌గ్గుమంది. శరద్ పవార్ నేతృత్వంలో జరిగిన పార్టీ మీటింగ్‌లో అజిత్‌ను ఈ బాధ్య‌త‌ల నుంచి తొల‌గిస్తూ...ఆయ‌న‌కు బదులుగా ఎన్‌సీపీ శాసనసభాపక్ష నేతగా జయంత్ పాటిల్‌ను ఎన్నుకున్నారు. మ‌రోవైపు బ‌ల‌ప‌రీక్ష డెడ్‌లైన్ విధించారు. దీంతో ఎన్‌సీపీ ఎమ్మెల్యేలు త‌న‌వైపు రాబోర‌ని, ఇదే స‌మ‌యంలో ఏర్ప‌డిన‌ త‌మ స‌ర్కారు  కొన‌సాగడం సందేహ‌మ‌ని అప‌న‌మ్మ‌కం ఏర్ప‌డి అజిత్ ప‌ద‌వి వీడారు.

అజిత్ గుడ్ బై చెప్పేయ‌డం, చీలిక ఎమ్మెల్యేలు ముందుకు రాక‌పోవ‌డంతో...సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ సైతం త‌న ప‌ద‌వికి బైబై చెప్పేసిన‌ట్లు తెలుస్తోంది. ఎన్‌సీపీ మొత్తం త‌మ‌కు అండ‌గా ఉంటుంద‌ని భావించామ‌ని...అయితే అజిత్ ప‌వ‌ర్ వెళ్లిపోయిన త‌ర్వాత‌ బ‌ల‌పరీక్ష‌లో త‌మ ప్ర‌భుత్వం నిల‌బ‌డ‌లేద‌నే విష‌యం అర్థ‌మైనందున ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఫ‌డ్న‌వీస్ తెలిపారు. శివ‌సేన త‌మ‌ను మోసం చేసింద‌ని ఆయ‌న ఆరోపించారు. కాగా బ‌ల‌మైన‌ ప్ర‌తిప‌క్షంగా ప్ర‌జ‌ల స‌మ‌స్య కోసం గ‌లం విప్ప‌నున్న‌ట్లు ఫ‌డ్న‌వీస్ తెలిపారు.