ఇదేం సంచలనం రా నాయనా... రెండు లక్షలు రుణమాఫీ

August 09, 2020

ట్విస్టులు మీద ట్విస్టులు.. మహారాష్ట్ర రాజకీయంలో వీళ్లకెందుకు ఓటేశాం రా బాబు అని ప్రతి ఓటరు అనుకునే స్థితికి వెళ్లాయి నెల క్రితం ఆ రాష్ట్ర రాజకీయాలు. బీజేపీతో ఎన్నికల ముందు కూటమి కట్టి ఫలితాల అనంతరం విడిపోయిన శివసేన డ్యామేజ్ అయ్యింది. ఆ తర్వాత హిందుత్వ ముద్ర ఉన్న పార్టీ పోయి కాంగ్రెస్ తో కలవడంతో ఇంకా చాలామంది చీదరించుకున్నారు. చివరకు బీజేపీ చేసుకున్న సెల్ఫ్ గోల్ తో శివసేన కి డ్యామేజ్ కొంచెం తగ్గింది. ఎట్టకేలకు ఉద్దవ్ తన పంతం నెగ్గించుకున్నారు. బీజేపీని కాదని సీఎం అయిపోయారు. అయితే... ఈ క్రమంలో జరిగిన డ్యామేజ్ ని ఒక సంచలన నిర్ణయం తీసుకుని పోగొట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

గత సెప్టెంబరు 30 వ తేదీ వరకు రైతులు తీసుకున్న అన్ని రుణాలను ఒక్క కలం పోటుతో రద్దు చేశారు ముఖ్యమంత్రి ఉద్దవ్. దీంతో మహారాష్ట్ర అంతటా పండగ వాతావరణం. రుణమాఫీ కొత్తది కాకపోయినా ఏకంగా 2 లక్షల రూపాయల వరకు ఉన్న అన్ని రైతు రుణాలు రద్దు చేయడంతో ఇది మహారాష్ట్రలో పెను సంచలనం అయ్యింది. రైతులు ఏ ఇబ్బంది పడకుండా ముంబైకి రావల్సిన అవసరం లేకుండా దీనికోసం ప్రతి జిల్లాలో రైతు సమస్యలు, రుణమాఫీ కోసం ప్రత్యేక కార్యాలయాలు పెడతాను అని ప్రకటించారు ముఖ్యమంత్రి ఉద్దవ్. ఈ పథకానికి మహాత్మా జ్యోతిరావు పూలే పేరు పెట్టి అందరితో శభాష్ అనిపించుకున్నారు ఉద్దవ్. అదే ఏపీలో అయితే ఏ ముఖ్యమంత్రి ఏం పేరు పెట్టేవారో మీకు అర్థమవుతుంది.