తండ్రిని పక్కన పెట్టేసిన జగన్

July 07, 2020

ఫిరాయింపుల గురించి చంద్రబాబును విమర్శిస్తూ ఇటీవల అసెంబ్లీలో జగన్ ఓ వ్యాఖ్య చేశారు. ఆ సందర్భంగా... ఫిరాయింపుల గురించి మాట్లాడే ముందు మీ తండ్రి ఫిరాయింపుల చరిత్ర తెలుసుకో అని తెలుగుదేశం నేతలు వ్యాఖ్యానించారు. వెంటనే జగన్ ఎవరో హత్యలు చేశారంటే మీరు చేస్తారా? అంటూ ప్రశ్నించారు. జగన్ నుంచి ఆ రిప్లయిని ఎవ్వరూ ఊహించలేదు.
పై సంఘటన వల్ల జగన్ అందరికీ ఒక సందేశం ఇచ్చారు. ’’నాకు మానాన్నకు ముడిపెట్టకండి. నేను తీసుకునే నిర్ణయాల వల్ల, నేను మాట్లాడే మాటల వల్ల మా నాన్నకు చెడ్డ పేరు వచ్చినా నాకు సంబంధం లేదు. మా నాన్న వేరు, నేను వేరు’’ అని అర్థం వచ్చేలా మాట్లాడారు. అయితే, తాజాగా అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం విన్నాక ... నాన్నను జగన్ పూర్తిగా పక్కనపెట్టేసినట్లు స్పస్టంగా తెలుస్తోంది. ఇంకా చెప్పాలంటే... గెలిచేశాను, ఇక వైఎస్ తో నాకేం పని అన్నట్లు జగన్ వ్యవహారం బడ్జెట్ ద్వారా స్పష్టంగా కనిపించింది. అది ఎలాగో చూద్దాం.
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2019 - 20 సంవత్సరానికి ఈరోజు బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రూ.2.27 లక్షల కోట్లతో భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అందులో అత్యధిక కేటాయింపులు సంక్షేమానికి చేశారు. ఈ సందర్భంగా కొన్ని పథకాలకు తండ్రి పేరు పెట్టినా... కొన్ని ముఖ్యమైన పథకాలకు జగన్ పేరు పెట్టారు. ఇక్కడ వైఎస్ అభిమానులు విస్మయం చెందుతున్న విషయం ఏంటంటే... తండ్రి ప్రవేశపెట్టిన ఒక కీలక మైన పథకానికి తండ్రికి బదులు తన పేరు పెట్టేసుకున్నారు జగన్. అత్యధిక కేటాయింపులు కూడా జగన్ పేరున్న పథకానికే ఇచ్చారు. జగన్ పేరు పెట్టడం ఇక్కడ అభ్యంతరకరం కాదు. తండ్రి సృష్టించిన పథకానికి కొడుకు తన పేరు పెట్టుకోవడమే ఆశ్చర్యకరం.
వైఎస్ ను ఎక్కువ మంది అభిమానించింది ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకం వల్లే. ఎందుకంటే... గతంలో ఏ ప్రభుత్వంలోనూ ఇలా ప్రజలకు ఏ పథకమూ సాఫీగా కులాల గోల లేకుండా దక్కలేదు. అగ్రకులాలతో పాటు అందరికీ ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకం వర్తింపజేయడంతో వైఎస్ క మంచి పేరు వచ్చింది. అందుకే ఆరోగ్య శ్రీతో పాటు వైఎస్ పెట్టిన ఆ పథకానికి వైఎస్సార్ పేరు పెడతారని అందరూ అనుకుంటే జగన్ పెద్ద ట్విస్టే ఇచ్చాడు. ఈ పథకానికి ’జగనన్న విద్యా దీవెన’ అని, అమ్మఒడి పథకానికి జగనన్న అమ్మఒడి పథకం అని నామకరణం చేశారు. మరీ తండ్రిని ఇలా తీసిపారేస్తే ఎలా అన్నది వైఎస్ అభిమానుల ఆవేదన.