చంద్రబాబు ఐడియాను అమలు చేస్తున్న తెలంగాణ 

August 13, 2020

గుర్తుందా... 2014లో ఏపీ లో అధికారంలోకి వచ్చాక చంద్రబాబు చేపట్టిన ఒక కీలకమైన ప్రాజెక్ట్ ఫైబర్ గ్రిడ్. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ప్రాజెక్టుగా చేపట్టిన ఈ పని వల్ల దేశంలోనే ఇంటర్నెట్, టీవీ ప్రసారాలను ఏపీ ప్రభుత్వం అతితక్కువకు ప్రజలకు అందించడానికి సాధ్యమైంది. దీనిని దేశమంతటా కొనియాడింది. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని బాగా మెచ్చుకుంది. దీంతో అప్పట్లో దాని విలువ గురించి తెలంగాణ గవర్నమెంటు ఆ ఐడియాను స్వీకరించింది. ఇక్కడ కూడా పనులు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్టు గురించి కేటీఆర్ మరోసారి మాట్లాడారు.

తెలంగాణలో ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ సేవలు కల్పిస్తామని ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తాజాగా తన నియోజకవర్గం అయిన రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రంగంపేటలో జరిగిన ఒక కార్యక్రమంలో వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో టీ -ఫైబర్ పనులు వేగంగా  కొనసాగుతున్నాయని అన్నారు. తెలంగాణలో త్వరలో ఇంటర్నెట్ సేవలు అందరికీ తక్కువ ధరల్లో అందుబాటులోకి వస్తాయన్నారు. పది నెలల్లో ఈ ప్రాజెక్టు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పూర్తవుతుందన్నారు.

ఇది విప్లవాత్మక మార్పులు తెస్తుందన్నారు. ఇప్పటికే ఉన్న డిజిటల్ నెట్ వర్క్ లు, డాటా సెంటర్లు కూడా దీని పరిధిలోకి తెస్తామన్నారు. ఇటీవలే దీనిపై కేటీఆర్ సమీక్ష కూడా నిర్వహించారు. ఈ పథకానికి సంజయ్ కారంపూరి అనే ఒక ప్రత్యేక అధికారిని ఎండీగా నియమించారు. కరోనా సంక్షోభంతో దీని అవసరం మరింత పెరిగిందన్నారు. విద్య, వైద్యం, ఆరోగ్య సంరక్షణ, వ్యాపారం... అన్నిటికీ ఇంటర్నెట్ వేదిక అయ్యిందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే పౌరులకు ప్రభుత్వం మరింత దగ్గరవుతుందన్నారు.

వ్యవసాయంలో కూడా రైతులు, అధికారులు, రైతు వేదికలు కనెక్ట్ కావడానికి ఇది సహకరిస్తుందని మంత్రి అన్నారు. ఇపుడు ఎన్నికలు ఏమీ లేవు ఇంకా నాలుగేళ్లు ఏమీ ఉండవు... అభివృద్ధి మీదే దృష్టి అంతా అన్నారు.