హమ్మయ్య... జగన్ కి కరోనా జ్జానోదయం

May 31, 2020

కరోనా దెబ్బకు పలు ప్రపంచ దేశాలలు విలవిలలాడుతోన్న సంగతి తెలిసిందే. భారత్ లోనూ క్రమక్రమంగా విస్తరిస్తోన్న ఈ మహమ్మారికి చెక్ పెట్టేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. పొరుగు రాష్ట్రం తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో విద్యాసంస్థలు, థియేటర్లు, షాపింగ్ మాల్స్...జన సామర్థ్యం ఉండే ప్రదేశాలను మార్చి 31 వరకు మూసి వేయాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఏపీలో కరోనా ప్రభావం పెద్దగా లేకపోవడంతో ఇప్పటివరకు నెల్లూరు జిల్లా మినహా మిగతా జిల్లాల్లో ఇటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. తాజాగా కరోనాపై మరింత అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్రం సూచనల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా పొరుగు రాష్ట్రం బాటలో పయనించింది. కరోనాకు చెక్ పెట్టేందుకు రేపటి నుంచి ఏపీలోని అన్ని విద్యాసంస్థలను మూసివేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని రకాల విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నామని విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. 

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా విద్యాసంస్థల మూసివేతకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ, వైద్య శాఖల ఉన్నతాధికారులతో  సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఆ సమీక్ష అనంతరం కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి ఏపీలోని అన్ని విద్యా సంస్థలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రకారం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం పాఠశాలలు, కళాశాలలు, యూనివర్శిటీలు, కోచింగ్ సంస్థలు మూసివేయాలని మంత్రి సురేష్ తెలిపారు.  రేపటి నుంచి విద్యాసంస్థలన్నింటికీ సెలవులు ప్రకటించామన్నారు.  అయితే, మార్చి 31 నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలు మాత్రం యథాతధంగా జరుగుతాయని అన్నారు. హాస్టళ్లలోని విద్యార్థులను ఆర్టీసీ బస్సుల్లో దగ్గరుండి ఇంటికి పంపిస్తామని తెలిపారు.